Nellore Woman Killed Occultist: ఇది ఒక సినిమాటిక్ క్రైమ్ స్టోరీ.. నెల్లూరులో 8 నెలల క్రితం జరిగిన ఓ వ్యక్తి హత్య కేసు మిస్టరీని తాజాగా అక్కడి పోలీసులు ఛేదించారు. గతేడాది నవంబర్ లో నెల్లూరులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి పేరు మంద మణికంఠ. అతడి శవాన్ని ఓ గోనె సంచిలో కుక్కి పడేశారు. ఈ మర్డర్ మిస్టరీలో పోలీసులకు దొరికిన ఏకైక ఆధారం ఏంటంటే.. మణికంఠ జేబులో ఓ చీటి లభించింది. ఆస్మ అనే మహిళ నుంచి తనకు ప్రాణ హానీ ఉంది అని అందులో రాసి ఉంది. విచిత్రం ఏంటంటే.. ఆస్మ అనే మహిళ ఇంటి ఎదుటే ఈ శవం లభ్యమైంది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఒకవేళ ఆస్మానే అతడిని చంపి ఉంటే.. ఆమె ఇంటి ముందే శవం ఎలా లభిస్తుంది.. అంతేకాకుండా మృతుడి జేబులో ఆ చీటిని ఆమె ఎందుకు ఉంచుతుంది అనే అనుమానాలు కలిగాయి.
గత 8 నెలలుగా ఈ మర్డర్ కేసు మిస్టరీ కొనసాగుతోంది. అయితే, మణికంఠ బ్యాంకు ఖాతాలోంచి ఏటీఎం ద్వారా వివిధ దఫాల్లో రూ. 3 లక్షల వరకు ఎవరో వ్యక్తులు డబ్బులు డ్రా చేయసాగారు. అక్కడి నుంచే పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ షురూ చేశారు. మణికంఠ మర్డర్ కేసులో ముగ్గురుని నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
డీసీపీ డి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో అడపాల కావ్య, ఆమె కుమార్తె 19 ఏళ్ల సాయి ప్రియ, కావ్య స్నేహితురాలు వెంప్లూరు కృష్ణ వేణిని అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధాన నిందితురాలు అయిన అడపాల కావ్య కొన్నేళ్ల క్రితమే భర్తను కోల్పోయి నెల్లూరులోనే ఓ ఇంట్లో తన కూతురు సాయి ప్రియతో కలిసి అద్దెకు ఉంటోంది. బతుకుదెరువు కోసం ఎన్సీసీ కాలనీలో జహీర్ భాషా మెడికల్ షాపులో పనిచేసేది. 2021 లో పెళ్లి కాని బాషా, అప్పటికే పెళ్లయి ఓ కూతురు కూడా ఉన్న అడపాల కావ్య ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. బాషాను పెళ్లి చేసుకున్న అనంతరం కావ్య తన పేరును సమీరా మార్చుకుంది.
తనకు ఓ తోడు దొరికిందని.. తన లైఫ్ సెటిల్ అయినట్టేనని... ఇక అంతా సాఫీగానే సాగిపోతోంది అని అనుకుంటున్న తరుణంలోనే బాషా వెళ్లి ఆస్మ అనే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి బాషా తనను పట్టించుకోవడం మానేశాడు అనే భావన కావ్యలో పెరిగిపోయింది. రెండో భార్య మోజులో పడి తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని భర్త బాషాపై ఆగ్రహం పెంచుకుంది. ఎలాగైనా మళ్లీ బాషాను తన వైపు తిప్పుకోవాలని అనుకుంది. అందుకోసం తన స్నేహితురాలు కృష్ణవేణిని సంప్రదించింది. భర్తను తన వశం చేసుకునేలా వశీకరణం తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పి ఆ పని అయ్యేలా చేసి పెట్టమని స్నేహితురాలు కృష్ణ వేణిని కోరింది.
స్నేహితురాలి కోరికతో ఈ పని చేసేందుకు అంగీకరించిన కృష్ణవేణి.. విజయవాడకు చెందిన తనకు తెలిసిన మంత్రగాడు మంద మణికంఠను సంప్రదించింది. తన స్నేహితురాలు ఆమె భర్తను వశీకరణం చేసుకునే పని చేసి పెట్టాల్సిందిగా అడిగింది. కృష్ణవేణి సూచన మేరకు మణికంఠ నెల్లూరులో కావ్య ఇంటికి చేరుకున్నాడు.
నిర్ణయం మార్చుకుని ప్లాన్ బి కి షిఫ్ట్ అయిన కావ్య
కృష్ణవేణి చెప్పినదాని ప్రకారం మణికంఠ నెల్లూరులో కావ్య ఇంటికి వచ్చేటప్పటికీ ఆమె నిర్ణయాలు మారిపోయాయి. భర్తను వశీకరణం చేసుకోవడం కంటే తనకు పోటీగా వచ్చిన అతడి రెండో భార్య ఆస్మాను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలనుకుంది. అందుకోసం ఓ కొత్త ఎత్తుగడ వేసింది. తన ఇంటికి వచ్చిన మణికంఠను చంపేసి.. ఆ హత్యా నేరాన్ని ఆస్మాపై మోపి ఆమెను జైలుకి పంపించాలని చూసింది. ఇంటికి వచ్చిన మణికంఠకు పాలలో అధిక మోతాదులో నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసింది. ఆ తరువాత కూతురు సాయి ప్రియతో కలిసి మణికంఠను హతమార్చింది. తనను ఆస్మా బెదిరిస్తోందని.. ఆమె నుంచి తనకు ప్రాణహానీ ఉందని మణికంఠనే రాసినట్టుగా ఓ చీటి రాసి అతడి జేబులో పెట్టింది. అతడి శవాన్ని ఓ గోనె సంచిలో కుక్కి ఆస్మా ఇంటి ముందు పడేసింది. అలా ఆస్మాపై హత్యా నేరాన్ని మోపి ఆమెను జైలుకు పంపిస్తే.. మళ్లీ తన భర్త బాషా తన వశం అవుతాడని అనుకుంది. మణికంఠ వద్ద నుంచి అతడి ఏటీఎం కార్డు కొట్టేసి అతడి ఖాతాలో ఉన్న డబ్బులను కూడా డ్రా చేయడం మొదలుపెట్టింది. అలా పోలీసులకు చిక్కింది.