రాజనాల... తెలుగు విలన్లకే రారాజు..!

1966లో ‘మాయా ది మెగ్నిషిమెంట్‌’ అనే హాలివుడ్‌ సినిమాలో నటించి, హాలివుడ్‌లో నటించిన తొలి తెలుగు నటునిగా రికార్డు సృష్టించారు రాజనాల.

Last Updated : Jan 3, 2018, 03:36 PM IST
రాజనాల... తెలుగు విలన్లకే రారాజు..!

తెలుగు సినీ చరిత్రలో విలనిజం అంటే ఇదిరా... అని తెగేసి చెప్పిన మేటి ప్రతినాయకుడు రాజనాల. పరుషమైన డైలాగ్స్ దగ్గర నుండీ ఆహార్యం, మేనరిజం, స్టైల్ అన్నింటిలోనూ వైవిధ్యాన్ని కనబరిచిన గొప్ప విలన్ ఆయన. పాతతరం నటుల్లో ఎంతమంది విలన్లు ఉన్నా.. టక్కున గుర్తుకొచ్చే పేరు రాజనాల అనడంలో మాత్రం అతిశయోక్తి లేదు. ఈ రోజు రాజనాల జయంతిని పురస్కరించుకొని ఆయన జీవిత ప్రస్థానం గురించి తెలుసుకుందాం

*1928 జనవరి 3 తేదిన నెల్లూరు జిల్లా కావలిలో జన్మించిన రాజనాల పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు. అయితే 'రాజనాల' పేరుతోనే ఆయన స్క్రీన్ నేమ్ బాగా ప్రాచుర్యం పొందింది.

*నాటకాలంటే పడిచచ్చే రాజనాల యువకుడిగా ఉన్నప్పుడే తన మిత్రుడితో కలసి నెల్లూరులో అడపా దడపా నాటకాలు వేసేవారు. అలా ఓ సందర్భంలో తాను వేసిన 'ఎవరు దొంగ' అనే  నాటకంలో అవినీతిని పెంచి పోషించే ప్రభుత్వ ఉద్యోగులను విమర్శించడం జరిగింది. అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న రాజనాల నాటకాన్ని చూసిన పై అధికారులు.. ప్రభుత్వ ఉద్యోగై కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాటకం వేశాడన్న నెపంతో సస్పెండ్ చేశారట. 

*అయితే రాజనాల మళ్లీ తాను కోల్పోయిన ఉద్యోగాన్ని వెతుక్కుంటూ వెళ్లలేదు. సినీ నటుడు అవ్వాలని మద్రాసు పట్టణం వచ్చారు. హెచ్ ఎం రెడ్డి నిర్మాతగా వచ్చిన 'ప్రతిజ్ఞ' సినిమాలో ఏ పాత్రా దొరక్కపోవడంతో ఆఖరికి విలన్‌గా చేశారు. అయితే అదే సినిమా సూపర్ హిట్టై తనకు మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని ఆయన ఊహించలేదు. ఆయన తొలి సంపాదన 200 రూపాయలు.

*తొలుత సాంఘిక చిత్రాల్లో నటించినా.. ఆ తర్వాత పౌరాణిక పాత్రలు కూడా లెక్కలేనన్ని రాజనాలను వరించాయి. కంసుడిగా, జరాసంధుడిగా కూడా ఆయన ఆయా పాత్రల్లో జనాలను మెప్పించారు. శ్రీకృష్ణ పాండవీయంలో శిశుపాలుడిగా, అల్లూరి సీతారామరాజు చిత్రంలో బ్రిటీష్ మేజర్ గుడాల్‌గా కూడా రాజనాల చాలా సహజంగా నటించారు. 

*1966లో ‘మాయా ది మెగ్నిషిమెంట్‌’ అనే హాలివుడ్‌ సినిమాలో నటించి, హాలివుడ్‌లో నటించిన తొలి తెలుగు నటునిగా రికార్డు సృష్టించారు రాజనాల.

*రాజనాలకు సైగల్ పాటలంటే ఎంతో ఇష్టం. ఆయన పాటలు పడుతూ ఎప్పుడూ తన తోటివారిని అలరించేవారు.

*ఇండస్ట్రీలో ఎంతోకొంత సంపాదించినా.. బాగా వయసైపోయాక, మద్రాసు నుండి హైదరాబాద్ వచ్చిన రాజనాల చాలా ఇబ్బందులు పడ్డారు. తాగుడు వ్యసనంతో చాలా ఆస్తులు పోగొట్టుకున్నారు.

*1979లో ఆయన భార్య మరణించాక చాలా రోజులు బయట ప్రపంచానికి కనబడలేదు. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా తారుమారవడంతో ‘భీమాంజనేయ’ అనే సినిమాను స్వయంగా నిర్మించాలన్న ఆయన కోరిక కూడా తీరలేదు. 

*ఆ తర్వాత రెండవ పెళ్లి చేసుకున్న రాజనాల, హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉండేవారు. ఆయన కుమారుల్లో ఒకరు మరణించగా.. మరొకరు ఇల్లు విడిచి వెళ్లిపోయారు. 1995లో ‘తెలుగు వీర లేవర’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్‌లో జరిగిన ప్రమాదం వల్ల రాజనాల కాలు కూడా పోయింది. ఆ తర్వాత అవకాశాలు కూడా తగ్గాయి

*రాజనాల తన చివరి రోజుల్లో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. జ్యోతిష్యం చెప్పుకుంటూ కూడా కొన్నాళ్లు ఆయన జీవించారు. ఆఖరికి 1998 మే 21 తేదిన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రాజనాల అక్కడే తుదిశ్వాస విడిచారు. 

More Stories

Trending News