Kantara Telugu Movie Review : కాంతారా మూవీ రివ్యూ.. నటనలో శభాష్ అనిపించే రిషబ్.. మెంటలెక్కించే క్లైమాక్స్

Rishab Shetty Kantara Telugu Movie కన్నడలో వచ్చిన కాంతారా మూవీని తెలుగులో నేడు రిలీజ్ చేశారు. మరి ఈ కాంతారా మూవీ రివ్యూ రేటింగ్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2022, 12:24 PM IST
  • కన్నడలో కాంతారా ప్రభంజనం
  • రిషబ్ శెట్టి ప్రతిభకు అంతా ఫిదా
  • క్లైమాక్స్‌లో ఉచ్ఛస్థాయికి నటన
Kantara Telugu Movie Review : కాంతారా మూవీ రివ్యూ.. నటనలో శభాష్ అనిపించే రిషబ్.. మెంటలెక్కించే క్లైమాక్స్

Kantara Movie Review in Telugu : ప్రస్తుతం కేజీయఫ్ తరువాత కన్నడ పరిశ్రమ మీద దేశ వ్యాప్తంగా అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు హోంబలే నిర్మించిన మరో చిత్రం దేశ స్థాయిలో మార్మోగిపోతోంది. కన్నడ స్టార్ హీరో అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన కాంతారా మూవీని తెలుగులో రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రం తెలుగు వారికి ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.

కథ
భూమి చుట్టూ తిరిగే కథ అని కాంతారా గురించి సింపుల్‌గా చెప్పొచ్చు. అయితే ఈ భూమి, అడవి చుట్టూ తిరిగే కథలో తీసుకున్న నేపథ్యాన్ని, ఆచారా సంప్రదాయాల్ని కలిపి చూపించినప్పుడు కొత్త కథగా అనిపిస్తుంది. ఓ రాజు.. ఎన్ని ఉన్నా కూడా మనశ్శాంతి కరువవుతుంది. అలా ఆ రాజు మనశ్శాంతి కోసం దేశాటకు వెళ్తాడు. అతడికి ఓ అడవిలో ఓ విగ్రహం కనిపిస్తుంది. దాన్ని తనతో పాటు పంపించమని రాజు అడుగుతాడు. కానీ ఊరి ప్రజలు ఒప్పుకోరు. తమ దైవం పంజూరియాను ఇవ్వమని అంటారు. మీరు ఏది కోరితే అది ఇస్తానని ఆ ప్రజలకు రాజు మాటిస్తాడు.

తన అరుపులు ఎక్కడి వరకు వినిపిస్తే.. అక్కడి వరకు ఉండే భూమిని ఊరికి రాసివ్వమని అడుగుతారు. సరేనంటూ రాజు ఆ భూములన్నీ కూడా ఇచ్చేస్తాడు. విగ్రహాన్ని తెచ్చుకుంటాడు. అప్పటి నుంచి రాజుకు మనశ్శాంతి, ప్రశాంతత చేకూరతాయి. ఇదంతా 1845 ప్రాంతంలో జరుగుతుంది. అయితే కాలక్రమేణా అంటే 1970 ప్రాంతంలో రాజు కుటుంబీకుల్లో కొంత మందికి ఆ భూమి మీద ఆశ పెరుగుతుంది. వాటిని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఊరిని కాపాడుతూ, దైవసేవ చేస్తూ కోలం ఆడే వారికి ఎదురెళ్తారు రాజ కుటుంబీకులు. దీంతో కోలం ఆడే వ్యక్తి అదృశ్యమవుతాడు. అలానే రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి రక్తం కక్కుకుని చస్తాడు. 

ఆ తరువాత అంటే 1990లోకి కథ ఎంటర్ అవుతుంది. ఊరి పెద్దగా, రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి దేవేంద్ర (అచ్యుత్ కుమార్) వ్యవహరిస్తాడు. కోలం ఆడాల్సిన శివ (రిషబ్ శెట్టి) దేవేంద్ర చుట్టూ తిరుగుతుంటాడు. ఊరి ప్రజలకు చేదోడువాదోడుగా ఉంటాడు. ఊర్లోకి ఫారెస్ట్ ఆఫీసర్ మురళీధర్ (కిషోర్) వస్తాడు. ఫారెస్ట్ ఆఫీసర్‌గా అటవీ భూములను పరీరక్షించేందుకు మురళీ ప్రయత్నిస్తుంటాడు. శివ తండ్రి కోలం ఆడుతూ చివరకు అదృశ్యం అవ్వడం వెనుకున్న కథ ఏంటి? చివరకు శివ కోలం ఆడతాడా?.. అసలు ఆ భూములను కాజేసేందుకు ప్రయత్నించిన వారు ఎవరు? క్షేత్రపాలకుడుగా మారి శివ ఆ భూములను కాపాడుతాడా? అనేది సినిమా కథ.

నటీనటులు
కాంతారా సినిమాలో ఎంతో మంది నటీనటులు కనిపిస్తారు. అయితే ఎంత మంది కనిపించినా అందరి చూపు మాత్రం రిషభ్ శెట్టి మీద పడుతుంది. రిషభ్ శెట్టి నటన ఏ స్థాయిలో ఉంటుందనేది క్లైమాక్స్ వరకు ఎవ్వరూ ఊహించలేరు. రిషభ్ శెట్టి లాంటి నటులు ఇంకా ఎవరైనా ఉంటారా? అనే స్థాయిలో నటించేశాడు. రిషభ్ శెట్టి కనిపించిన తీరుకు అందరూ దండం పెట్టేస్తారు. అచ్యుత్‌కు పర్ఫామెన్స్ చేసే స్కోప్ బాగా దొరికింది. విభిన్న షేడ్స్‌లో మెప్పించాడు. ఇక అటవీ అధికారికా కిషోర్ మెప్పించాడు. లీల పాత్రలో హీరోయిన్‌గా కనిపించిన సప్తమీ గౌడ అద్భుతంగా అనిపిస్తుంది. అందంగా కనిపించడమే కాదు.. చివర్లో యాక్షన్ సీక్వెన్స్‌లోనూ మెప్పించింది. ఇక శివతో పాటు ఉండే బృంధం, కొన్ని పాత్రలు అలా నవ్వించేస్తాయి.

విశ్లేషణ
కాంతారా కథ సింపుల్‌గానే అనిపిస్తుంది. కానీ ఆ పాయింట్ కోసం ఎంచుకున్న నేపథ్యం, రాసుకున్న కథనం, అల్లుకున్న ఆచారసంప్రాదాయాలు అన్నీ అద్భుతంగా సెట్ అయ్యాయి. అటవీ ప్రాంతం, అందులో రాజ కుటుంబీకులు భూములు, కోలం ఆడే సంప్రదాయం, కాపాడే క్షేత్ర పాలకుడు అంటూ ఇలా కథలో ఎన్నో ఆసక్తిరమైన అంశాలను జోడించాడు దర్శకుడైన రిషభ్ శెట్టి.

రాసింది తానే తీసింది తానే.. నటించింది తానే కాబట్టి రిషభ్ శెట్టికి అన్నీ కలిసి వచ్చాయి. తన పరిధిని మించి రాసుకున్న కథకు.. అద్భుతంగా న్యాయం చేశాడు. కథ, కథనం ఇలా ఎంతో పకడ్బంధీగా పేర్చుకున్నట్టు అనిపిస్తుంది. అయితే ప్రథమార్థంలో కొంత, ద్వితీయార్థంలో కొంత సేపు స్లోగా అనిపించినా.. క్లైమాక్స్ మాత్రం ఎవరెస్ట్ అంచున తీసుకెళ్లి పెట్టినట్టు అనిపిస్తుంది.

ఈ సినిమా ప్రాణం అంతా కూడా ఆ క్లైమాక్స్ ఎపిసోడ్‌లోనే పెట్టినట్టు అనిపిస్తుంది. రిషభ్  కూడా ఈ కోణంలోనే కథ రాసుకున్నట్టు అనిపిస్తుంది. ముందు అంతా కూడా తనలోని ఓ కోణాన్ని చూపించుకుంటే.. చివర్లో మాత్రం మరో కోణాన్ని ఆవిష్కరించేసుకున్నాడు. దర్శకుడిగా, హీరోగా ఒకేసారి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశాడా? అని అందరూ ఆశ్చర్యపోవాల్సిందే.

రిషభ్ శెట్టి నట విశ్వరూపం చూసి థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వెళ్తారు. అలా ప్రేక్షకులను హంట్ చేస్తూనే ఉంటాడు. ఇక కాంతారా పార్ట్ 2కి కూడా లైన్ వేసినట్టు అనిపిస్తుంది. మొత్తానికి కాంతారాలో ఎన్ని ఎలివేషన్ సీన్లున్నా.. మాస్‌ను మెప్పించే యాక్షన్ సీక్వెన్స్ పెట్టినా, ఎంట్రీ సీన్ ఉన్నా కూడా అవన్నీ.. క్లైమాక్స్ ముందు దిగదుడుపే అనిపిస్తుంది.

రిషభ్ శెట్టి మేకింగ్ అందరినీ ఆశ్చర్యపరిస్తే.. ఆయన నటన అందరినీ ఇంకో ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుంది. కెమెరా పనితనానికి టాప్ నాచ్ అనేపదం తక్కువే అవుతుంది. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. విజువల్స్ పరంగా అద్భుతం అనిపిస్తుంది. అజనీష్ సంగీతం,నేపథ్య సంగీతం ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది. రిషభ్ శెట్టి కోలం వేస్తూ అరిచే అరుపులకు, అజనీష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు అంతా చేతులెత్తి మొక్కాల్సిందే. ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా అద్భుతంగా పని చేసింది.

ఈ సినిమాకు రేటింగ్ ఇచ్చి.. రిషభ్ శెట్టి నటనను కొలవడం కూడా పిచ్చిదనమే అవుతుందేమో. కొన్ని సినిమాలను మనం లెక్కలేసుకుని చూడకుండా ఆస్వాధించాల్సి ఉంటుంది. అందులో ఈ కాంతారా కూడా ఒకటి.

Also Read : Nayanthara Surrogacy : సరోగసితో చిక్కుల్లో నయన్ విఘ్నేశ్.. ఆ లూప్ హోల్‌తో తప్పించుకునేందుకు విఫల ప్రయత్నాలు

Also Read : Harry Potter Actor : హ్యారీ పోటర్ నటుడు మృతి.. వెలుగులోకి రాని కారణాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News