సినీస్టార్స్.. సింగర్స్‌గా మారిన వేళ..!

ప్రముఖ కథానాయకులు అప్పుడప్పుడు గాయకులుగా కూడా తమ లక్ పరీక్షించుకున్నారు. అంటే సూపర్ స్టార్లు.. సూపర్ సింగర్స్‌గానూ రాణించి ప్రేక్షకుల నుండి నీరాజనాలు అందుకున్నారన్న మాట. మరి ఆ విశేషాలేమిటో మనమూ తెలుసుకుందాం..!

Babu Koilada | Updated: Mar 9, 2018, 08:19 PM IST
సినీస్టార్స్.. సింగర్స్‌గా మారిన వేళ..!

ప్రముఖ కథానాయకులు అప్పుడప్పుడు గాయకులుగా కూడా తమ లక్ పరీక్షించుకున్నారు. అంటే సూపర్ స్టార్లు.. సూపర్ సింగర్స్‌గానూ రాణించి ప్రేక్షకుల నుండి నీరాజనాలు అందుకున్నారన్న మాట. మరి ఆ విశేషాలేమిటో మనమూ తెలుసుకుందాం..!

మెగాస్టార్ చిరంజీవి - మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా 1997లో విడుదలైన "మాస్టర్" సినిమాతో ప్లేబ్యాక్ సింగర్‌గా మారారు. దేవా సంగీత దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో ఆయన "తమ్ముడు.. అరె తమ్ముడు" అనే పాట పాడారు. ఆ తర్వాత 2001లో విడుదలైన 'మృగరాజు' చిత్రంలో ఆయన "ఛాయ్.. చటుక్కున తాగరా భాయ్" అనే పాటను పాడారు. ఆ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. 

నందమూరి బాలకృష్ణ - నందమూరి బాలకృష్ణ 2017లో విడుదలైన "పైసా వసూల్" చిత్రంలో తొలిసారిగా "మామా ఏక్ పెగ్ లా" అనే సాంగ్ పాడారు. ఆ పాటను భాస్కరభట్ల రాశారు. ఆ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించారు. 

దగ్గుబాటి వెంకటేష్ - దగ్గుబాటి వెంకటేష్ 2017లో విడుదలైన 'గురు' చిత్రంలో తొలిసారిగా 'జింగిడి జింగిడి' అనే పాట పాడారు. ఆ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించారు. ఆ పాటను భాస్కరభట్ల రాశారు.

పవన్ కళ్యాణ్ - పవన్ కళ్యాణ్ తొలుత తన సినిమాల్లోనే కొన్నింటికి బిట్ సాంగ్స్ పాడారు. 2011లో మాత్రం పంజా చిత్రంలో "పాపారాయుడు" సాంగ్ ద్వారా ప్లేబ్యాక్ సింగర్‌గా మారారు.ఈ గ్రూప్ సాంగ్‌ను ఆయన హేమచంద్ర, సత్యన్, బ్రహ్మానందంతో కలిసి పాడడం గమనార్హం. అలాగే 2013లో 'అత్తారింటికి దారేది' చిత్రంలో 'కాటమరాయుడా.. కదిరినరసింహుడా' అనే పాటను పాడారు. దానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. 2018 మళ్లీ 'అజ్ఞాతవాసి' చిత్రంలో 'కొడకా కోటేశ్వరరావు' అనే పాటను పాడారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకత్వం వహించారు.

జూనియర్ ఎన్టీఆర్ - జూనియర్ ఎన్టీఆర్ 2014లో తొలిసారిగా 'రభస' చిత్రంలో 'రాకాసి రాకాసి' సాంగ్ పాడారు. ఆ చిత్రానికి ఎస్.తమన్ సంగీత దర్శకత్వం వహించారు. అలాగే 2016లో 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో 'ఫాలో ఫాలో యూ' సాంగ్ పాడారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలకే కాకుండా పునీత్ రాజ్ కుమార్  నటించిన 'చక్రవ్యూహ' అనే కన్నడ చిత్రంలో కూడా 'గెలియా గెలియా' అనే సాంగ్ పాడారు. ఆ పాటకి తమన్ సంగీత దర్శకత్వం వహించారు. అదే చిత్రానికి మిర్చి మ్యూజిక్ అవార్డు కూడా అందుకున్నారు.

అక్కినేని నాగార్జున - అక్కినేని నాగార్జున 1999లో విడుదలైన 'సీతారామారాజు' చిత్రంలో తొలిసారిగా 'వినుడు వినుడు సిగరెట్ గాథ' అనే పాట పాడారు. ఆ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. 2016లో 'నిర్మలా కాన్వెంట్' చిత్రంలో అనంతశ్రీరామ్ రచించిన 'కొత్త కొత్త భాష' అనే పాటను పాడారు. ఈ సినిమాకి రోషన్ సాలూరి సంగీత దర్శకత్వం వహించారు. 
 
అఖిల్ అక్కినేని - అఖిల్ అక్కినేని 2017లో విడుదలైన 'హలో' చిత్రంలో 'ఏవేవో' అనే సాంగ్ పాడారు. ఈ పాటను చంద్రబోస్ రచించిగా.. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించారు. 

మంచు మనోజ్ - మంచు మనోజ్ 2013లో విడుదలైన 'పోటుగాడు' చిత్రంలో 'ప్యార్ మే పడిపోయానే' అనే పాట పాడారు. ఆ పాటను భాషాశ్రీ రాయగా..అచ్చు రాజమణి సంగీత దర్శకత్వం వహించారు

రవితేజ - రవితేజ 2013లో 'కాజల్‌కు చెల్లెవా.. కరీనాకి కజిన్‌వా' అనే పాటను 'బలుపు' చిత్రంలో పాడారు. అలాగే 2014లో పవర్ చిత్రంలో నోటంకీ నోటంకీ అనే పాటను పాడారు. ఈ రెండు పాటలకు తమన్ సంగీత దర్శకత్వం వహించారు. 2017లో రాజా ది గ్రేట్ చిత్రంలో టైటిల్ సాంగ్ కూడా పాడారు. ఆ పాటకు సాయి కార్తీక్ దర్శకత్వం వహించారు. 

మహేష్ బాబు  - మహేష్ బాబు 2011లో విడుదలైన 'బిజినెస్‌మాన్' చిత్రంలో 'బాగ్ సాలే' అనే పాటను పాడారు. దానికి భాస్కరభట్ల లిరిక్స్ రాయగా.. తమన్ సంగీత దర్శకత్వం వహించారు.

వీరే కాకుండా, కొబ్బరిమట్ట చిత్రం ద్వారా సంపూర్ణేష్ బాబు, అలాగే స్వామిరారా చిత్రంతో నిఖిల్ కూడా గాయకులుగా మారారు.