44 Years Of Undisputed Megastar:44 ఏళ్ల ప్రాణం ఖరీదు.. పాలేరు వేషంలో షూట్.. హీరోయిన్ ను అతుక్కుపోయిన చిరు.. మొదటి సినిమాకే బలుపంటూ కామెంట్స్!

Unknown Facts about Megastar Chiranjeevi's Debut Praanam Khareedu: మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు విడుదలై 44 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 22, 2022, 02:34 PM IST
44 Years Of Undisputed Megastar:44 ఏళ్ల ప్రాణం ఖరీదు.. పాలేరు వేషంలో షూట్.. హీరోయిన్ ను అతుక్కుపోయిన చిరు.. మొదటి సినిమాకే బలుపంటూ కామెంట్స్!

44 Years Of Undisputed Megastar: Unknown Facts about Megastar Chiranjeevi's Debut Praanam Khareedu: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే ఒక సామాన్యమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి స్థాయికి ఎదిగి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించడమే కాక తన కుటుంబంలో కూడా అనేక మందికి జీవితాన్ని ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో మందికి ఆదర్శం.

అసలు ఏమీ లేని స్థాయి నుంచి ప్రేక్షకులందరికీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా గూడు కట్టుకున్నాడు. అయితే అదేమీ ఒక్కరోజులో జరిగిపోలేదు అనేక సంవత్సరాల అకుంఠిత దీక్ష, పట్టు వదలని పట్టుదలతో ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవికి ఎంతో స్పెషల్. ఎందుకంటే ఆయన మనిషిగా జన్మించింది ఆగస్టు 22వ తేదీ అయిన నటుడిగా జన్మించింది మాత్రం సెప్టెంబర్ 22వ తేదీ.

అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి చేసిన మొదటి సినిమా పునాదిరాళ్లు అయినా ఆయన నటించి విడుదలైన మొదటి సినిమా మాత్రం ప్రాణం ఖరీదు. సరిగ్గా 44 ఏళ్ల క్రితం 1978వ సంవత్సరంలో సెప్టెంబర్ 22వ తేదీన ప్రాణం ఖరీదు సినిమా విడుదలైంది. అలా మెగాస్టార్ చిరంజీవి నటుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి సుమారు 44 ఏళ్లు పూర్తి చేసుకున్నట్టయింది.  
 
 మీకు తెలియని కొన్ని విషయాలు:
ఇక ఆ సినిమా గురించి మీకు తెలియని కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మద్రాసులో నిర్మాత క్రాంతి కుమార్ ఒక కొత్త సినిమా ప్రారంభిస్తూ ఉండడంతో ఆయన ఆఫీసు అంతా హడావిడిగా ఉంది. ప్రొడక్షన్ మేనేజర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు సహా వేషాల కోసం వచ్చే ఆర్టిస్టులతో ఆ ఆఫీస్ అంతా ఒక పెళ్లి ఇంటి లాగ కళకళలాడిపోతోంది. రచయిత సీఎస్ రావు రచించిన ప్రాణం ఖరీదు అనే నాటకం అప్పట్లో బాగా ఫేమస్ అవడంతో అదే నాటికను కే వాసు డైరెక్షన్లో తెరకెక్కించాలని క్రాంతి కుమార్ నిర్ణయించుకున్నారు.

ఆ నాటికను నెల్లూరు పరిషత్ పోటీల్లో ప్రదర్శిస్తున్నారు అని తెలిసి వారిద్దరూ కలిసి నెల్లూరు వెళ్లి నాటకాన్ని చూసి వచ్చారు. నాటకం బాగా నచ్చడంతో సిఎస్ రావు తో మాట్లాడి ఆయన చేతే సినిమాకి కూడా స్క్రిప్ట్ రాయించారు. నటీనటులు, టెక్నీషియన్లు ఇలా అందరినీ ఎంపిక చేశారు. అయితే హీరో ఇప్పుడున్న వారు కాకుండా కొత్తగా ఎవరైనా అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించారు. అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్న ప్రేమ్ కుమార్ అనే ఆయన ఒక కొత్త కుర్రాడి  ఫోటోలు చూపించడంతో చూసిన వెంటనే దర్శకుడు వాసు మేకప్ టెస్ట్ కి పంపడం, ప్రాణం ఖరీదులో నరసయ్య అనే పాత్రకి ఆ కొత్త కుర్రాడు ఎంపికవడం వెంట వెంటనే జరిగిపోయాయి.

అలా సెప్టెంబర్ 22 1978వ సంవత్సరంలో విడుదలైన ప్రాణం ఖరీదు సినిమాలో మెడలో ఒక కాశీతాడు, భుజాన ఒక మాసిన తువ్వాలు పక్కకు దువ్విన గిరజాల జుట్టుతో నరసయ్య అనే పాత్రలో అతి సామాన్యంగా కనిపించిన ఒక వ్యక్తి అసామాన్య స్థాయికి చేరుకుంటాడని మెగాస్టార్ గా తెలుగు ప్రజలందరికీ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటాడని ఎవరూ ఊహించి ఉండరు. ఎక్కడో పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక మారుమూల గ్రామం మొగల్తూరులో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలలో తిరుగుతూ నటన మీద పెరిగిన ఆసక్తితో ఎలా అయినా నటుడిగా మారాలనే తపనతో ఆ స్థాయికి వచ్చాడు ఆ యువకుడు. నిజానికి ఆయనకు ఈ సినిమా కంటే ముందే పునాదిరాళ్లు అనే సినిమాలో అవకాశం లభించింది.

ఆ సినిమా స్టిల్స్ చూసే ప్రాణం ఖరీదు సినిమా కోసం ఆయనను ఎంపిక చేసుకున్నారు. ఒకరకంగా ప్రాణం ఖరీదు చిరంజీవి మొదట నటించిన సినిమా అయినా ఆయన నటనలో ఎక్కడా తొందరపాటు కానీ చిన్న ఇబ్బంది పడిన భావన కానీ ఉండదు. ఆయన నటనలో ఉన్న మెచ్యూరిటీ, డైలాగ్ డెలివరీ అప్పటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిజానికి ప్రాణం ఖరీదు సినిమాని ముందు కలర్ లోనే రెడీ చేద్దామనుకున్నారు. కానీ ఈ సినిమా ఒక పీరియాడిక్ ఫిలిం అంటే స్వాతంత్రానికి పూర్వం కథగా రూపొందించాలని అనుకుని బ్లాక్ అండ్ వైట్ లోనే చేయాలని భావించి దానికి తగినట్లుగానే స్వాతంత్రానికి పూర్వం ఎలా ఉండేవారో దానికి తగ్గ బట్టలే సిద్ధం చేయించారు.

1978 మే నెలలో షూటింగ్ మొదలైంది. కానీ అది మంచి ఎండాకాలం కావడంతో బాగా వడగాల్పుల దెబ్బకు భయపడి తెల్లవారుజామున 5:00 కు షూటింగ్ మొదలుపెట్టి 9:30 కి బ్రేక్ చెప్పేవారు, తర్వాత పదకొండు గంటలకల్లా లంచ్ పూర్తి చేసేసి రెస్ట్ తీసుకునేవారు. తర్వాత ఎండ తగ్గినాక మూడు గంటల నుంచి షూటింగ్ మొదలుపెట్టి సూర్యాస్తమయం వరకు షూటింగ్ చేసేవారు. రాజమండ్రి దగ్గరలోని పొట్టిలంక అనే గ్రామంలో ఈ షూటింగ్ సింహభాగం జరిగింది. అదేవిధంగా ధవళేశ్వరం దగ్గరలోని వేమగుడిలో కూడా ఈ సినిమా షూటింగ్ జరిపారు. అప్పట్లో సినిమా యూనిట్ అంతా కూడా రాజమండ్రి అప్సర హోటల్లో బస చేశారు మొత్తంగా ఆ సినిమాకి 45 రోజుల పాటు షూటింగ్ జరిపారు. కైకాల సత్యనారాయణ, చంద్రమోహన్, రావు గోపాల్ రావు, జయసుధ వంటి  బిజీ బిజీ ఆర్టిస్టులు అందరూ ఆ సినిమాలో మోహరించి ఉన్నా సరే ఎందుకో గాని షూటింగ్ రిలాక్స్ మోడ్ లోనే జరిగేదని దర్శకుడు కే వాసు గతంలో ఒక సందర్భంలో వెల్లడించారు.

ఒకళ్ళకొకళ్ళు అతుక్కుపోయారట:

ఈ సినిమాలో హీరోయిన్ గా ఒరియాలో అప్పట్లో టాప్ హీరోయిన్ అయినా రేష్మి రాయ్ ని తీసుకొచ్చారు. భాషా సమస్యలు ఉన్నా సరే ఆ అమ్మాయి కూడా మెగాస్టార్ చిరంజీవితో సరి సమానంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.. ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చిరంజీవి రేష్మి రాయ్ మధ్య ఒక డ్యూయెట్ ప్లాన్ చేశారు. దాన్ని మద్రాసులోని బాలాజీ గార్డెన్ లో షూట్ చేస్తున్నారు. ఆ షూటింగ్లో భాగంగా ఇద్దరినీ హగ్ చేసుకోమని అంటే ఇద్దరికీ అలా చేయడం కొత్తేనట. ఆవిడ ముట్టుకుంటే ప్రొసీడ్ అవ్వచ్చని చిరంజీవి,  చిరంజీవి ముట్టుకుంటే ప్రొసీడ్ అవ్వచ్చని రేష్మి మనసులో అనుకుంటూ ఉండిపోయారట. కెమెరా రన్ అవుతున్నా ఇద్దరిలో కదలిక లేకపోవడంతో క్రాంతి కుమార్ గట్టిగా వాటేసుకోమని అరవడంతో ఒకళ్ళకొకళ్ళు అతుక్కుపోయారట కట్ చెప్పినా కూడా కొన్ని సెకండ్ల పాటు వారికి అర్థం కాక అలాగే ఉండిపోయారంట.

నా మీదే నిందలు: 

ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకున్నారు. తన సినీ జీవితం ప్రాణం ఖరీదు సినిమాలో పాలేరు పాత్రతో ప్రారంభమైందని, నేను ఆ సినిమాకు ఒక పాత పంచ కట్టుకుని ఒంటిమీద బట్టలు, మేకప్ లేకుండా నిజమైన పాలేరు లాగా వెళ్లానని, నా రూపానికి తగ్గట్టే బిక్కుబిక్కుమంటూ ఎవరితోనో గల కలవకుండా భయపడుతూ దూరం దూరంగా ఒంటరిగా ఉండే వాడిని ఎందుకంటే నాకు అప్పటికి ఎవరితో చనువు లేదు, ఆ క్యారెక్టర్ గెటప్ ప్రభావమో ఏమో తెలియదు కానీ నా గురించి కూడా ఎవరూ పట్టించుకునేవారు కాదని ఆయన అన్నారు. ఒక క్రాంతి కుమార్ గారు మాత్రమే నా గురించి పట్టించుకుని చిరంజీవి భోజనం చేసావా? ఏమైనా కావాలా? అంటూ మాట కలిపి ఉత్సాహపరుస్తూ ఉండేవారు అని చెప్పుకొచ్చారు.

విచిత్రం ఏమిటంటే కొందరు పెద్ద మనుషులు అలాంటి సందర్భంలో నా మీద అకారణంగా ఆగ్రహం పెంచుకున్నారని, నేను వాళ్లు కనపడగానే నమస్కారం పెట్టలేదని వాళ్ళు కోపం పెంచుకున్నారని, వాళ్ళు ఎవరో నాకు తెలుసు కానీ పరిచయం లేదు, పూర్తిగా పరిచయం లేని వ్యక్తిని మనం కలగజేసుకొని ఎలా పలకరిస్తాం ? అదికాక నేను కొత్త నటుడిని అలా పలకరిస్తే ఏమనుకుంటారో అని భయపడేవాడిని. అందుకే నేను నాకు భయంతో దూరంగా ఉండేవాడిని. కానీ వాళ్లు మాత్రం వీడికి ఎంత గర్వం నిన్నగాక మొన్న ఇండస్ట్రీకి వచ్చాడు, అప్పుడే కళ్ళు నెత్తికెక్కాయి అని అనుకున్నారు కానీ నేనేం చేయను నిజానికి కొత్తవాడిని అయినా నన్ను సీనియర్లు స్వయంగా వచ్చి పలకరించి నా బిడియాన్ని పోగొట్టి తమలో కలుపుకోవాలి కానీ అక్కడ అలా జరగలేదు కానీ ఎదురు నా మీదే నిందలు వచ్చాయని ఆయన పంచుకున్నారు. 
 

Trending News