Matti Kusthi Telugu Movie Review విష్ణు విశాల్ మంచి నిర్మాతగా, హీరోగా కోలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. చివరగా విష్ణు విశాల్ FIR అంటూ కోలీవుడ్, టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక నిర్మాతగా తన అభిరుచిని మరోసారి చాటేందుకు విష్ణు విశాల్ మట్టి కుస్తీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
కీర్తి (ఐశ్వర్య లక్ష్మీ) ఓ రెజ్లర్. రెబల్ క్యాండిడేట్. స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొనాలని కలలు కంటుంది. కానీ తండ్రి అందుకు అంగీకరించడు. పొట్టి బట్టలు వేసుకుని ఇలా కుస్తీ పడే అమ్మాయిని ఎవరు చేసుకుంటారు అని వచ్చి సంబంధమల్లా చెడిపోతుంటుంది. వీర (విష్ణు విశాల్) చదువు సంధ్యా లేనోడు. ఊర్లో పనిపాటా లేకుండా తిరుగుతాడు. ఆడది అంటే మగాడి కిందే ఉండాలి.. మగాడు చెప్పిందే వినాలి అనే టైపులో పెరుగుతాడు. మగాడు అనే అహంభావంతో ఉంటాడు. అలాంటి వీరకు, కీర్తికి పెళ్లి ఎలా జరిగింది? పెళ్లి జరిగిన తరువాత ఇద్దరి మధ్య ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి? ఈ కథలో దాస్ (అజయ్), రెజ్లర్ కోచ్ (శత్రు) పాత్ర ఏంటి? కీర్తి, వీరల మధ్య మట్టి కుస్తీ పోటీ ఎందుకు పెట్టాల్సి వస్తుంది? చివర్లో ఎవరు గెలిచారు? అనేది కథ.
నటీనటులు
వీర పాత్రలో మొదటిసారిగా ఇలా మాస్ కమర్షియల్ అంశాలున్న కథలో నటించాడు విష్ణు విశాల్. పనీపాటాలేని వీర పాత్రలో విష్ణు విశాల్ నటన మెప్పిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగానే సెట్ అయ్యాయి. అక్కడక్కడా నవ్విస్తాడు కూడా. ఇక ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షన్‌గా నిలిచేది కీర్తి పాత్రే. ఆ కారెక్టర్‌లో ఐశ్వర్యా లక్ష్మీ అందరినీ కట్టిపడేస్తుంది. ఓ ఆశయంతో ఉండే మోడ్రన్ అమ్మాయిగా ఐశ్వర్య చక్కగా నటించింది. యాక్షన్ సీక్వెన్స్‌లో మాత్రం అదిరిపోయే యాటిట్యూడ్‌ను ప్రదర్శించింది. కరుణాస్, అజయ్, శత్రు, హరీష్ పేరడి, కాళీ వెంకట్ ఇలా అందరూ కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
విశ్లేషణ
మట్టి కుస్తీ అనే పేరుతో ఇదేదో స్పోర్ట్స్ డ్రామా అని అనుకుంటారేమో అంతా. కానీ హీరో అయితే ముందుగానే క్లారిటీగా చెప్పాడు. ఇది సగటు భార్యాభర్తల మధ్య జరిగే ఘటనల చుట్టూ ఉంటుందని విష్ణు విశాల్ ముందే చెప్పాడు. కుస్తీ అనేది చిన్న లైన్ మాత్రమే. భార్యాభర్తల మధ్య ఉండే ఇగోలు, గొడవలు, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే గౌరవాలు, సమాజంలో ఆడదాన్ని మగాడు చూసే కోణం, ఆడదాన్ని అణిచి వేయాలని చూసే మగాడి బుద్ది మీద ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు చెల్లా అయ్యావు.
ఆడ మగ సమానమేనని, ఆడది లేకపోతే మగాడు బతకలేడని, మగాడు లేకపోయినా ఆడది ఒంటరిగా సంసారాన్ని నడిపించగలదని అక్కడక్కడా డైలాగ్స్‌తో చెప్పించాడు డైరెక్టర్. ఆడవాళ్లను ఇంటికే పరిమితం చేయాలని చూసే వారందరికీ కౌంటర్ వేసినట్టుగా అనిపిస్తుంది. అయితే ఈ పాయింట్ చెప్పేందుకు దర్శకుడు కాస్త స్పోర్ట్స్ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ఇదే పాయింట్‌ను ఇది వరకు ఎంతో మంది ఎన్నో రకాలు చెప్పారు.
కానీ మట్టి కుస్తీలో కాస్త వినోదంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఊరి వాతావరణం, అల్లరి చిల్లరగా తిరిగే హీరో, అతని ఫ్రెండ్స్ అంటూ ఇలా ఫస్ట్ హాఫ్ కాస్త ఫన్నీగా సాగుతుంది. మరో వైఫు కుటుంబం కోసం అణిగి మణిగి ఉన్న భార్య కీర్తి అసలు స్వరూపాన్ని వీర ఇంటర్వెల్ సీన్‌లోనే చూస్తాడు. ఆ ఇంటర్వెల్ సీన్‌లో ఐశ్వర్య యాక్షన్, ఆమె బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అన్నీ అదుర్స్ అనిపించేలా ఉంటాయి. అది మినహా ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్‌గానే ఉంటుంది.
సెకండాఫ్ కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. భార్య గొప్పదనం, ఆడదాని గొప్పదనం వీర తెలుసుకునే సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. క్లైమాక్స్ కాస్త రొటీన్‌గానే అనిపిస్తుంది. అయితే ఇందులో ఎక్కువగా తమిళ నేటివిటీ తగ్గ సీన్లే కనిపిస్తాయి. డైలాగ్స్ కూడా చక్కగా అనిపిస్తాయి. నీ మీద పోటీ పడకుండానే మీ ఆయన గెలిచాడు అంటూ కీర్తి తల్లి చెప్పే డైలాగ్ బాగుంటుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్, కెమెరా పనితనం, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ బాగున్నాయి.
రేటింగ్ : 2.5
బాటమ్ లైన్ : మట్టి కుస్తీ.. భార్యాభర్తలిద్దరూ గెలిచిన పోటీ
Also Read : Ginna OTT Streaming: మంచు విష్ణు జిన్నా ఓటీటీ స్ట్రీమింగ్ రేపట్నించే, ఎందులోనంటే
Also Read : Adivi Sesh HIT 2: అన్నీ అనుమానాలే.. అందుకే ఇలా ఉన్నా.. అడివి శేష్ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook