సంజయ్ దత్.. స్నేహితులు ఇష్టంగా పిలుచుకొనే పేరు సంజు బాబా. సంజూకి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. బాలీవుడ్లో ఆయనకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఇతర విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ స్నేహితుల విషయంలో మాత్రం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు. అలా ఓసారి బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌కు సమస్య వస్తే సంజయ్ అతడికి అండగా నిలిచారు .
‘మున్నభాయ్ ఎంబీబీఎస్’ సినిమా విడుదల సమయంలో షారుక్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఉండేవారు. ఈ షోలో సంజయ్ బోమన్ ఇరానీతో కలిసి పాల్గొన్నారు. ఆ షోలో సంజయ్ తనకు ఎంత సాయం చేశారో షారుక్ చెప్పారు.
షారుక్ బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలిరోజులు అవి. షారుక్ సినిమా వేషాల కోసం ఢిల్లీ నుంచి ముంబయి వచ్చారు. ఇండస్ట్రీకి కొత్త.. అదీగాక ముంబైలో తెలిసినవారెవ్వరూ లేరు. ఓసారి షారుక్‌కు ఓ వ్యక్తితో పెద్ద గొడవైందట. ఎక్కడ తన కెరీర్ పాడవుతుందేమోనని షారుక్ చాలా భయపడ్డారట. ఎవరికి చెప్పుకోవాలో తెలీక మౌనంగా ఉండేవారట. ఆ సమయంలో షారుక్ ఇంటికి జీప్ వేసుకొని ఒక వ్యక్తి వచ్చాడు. ‘నీ మీద ఎవరైనా చెయ్యి వేస్తే నాతో చెప్పు’ అని ధైర్యం చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో కాదు సంజయ్ దత్. ఈ విషయాన్ని షారుక్ వెల్లడిస్తూ..‘ఈ ఒక్క విషయంలో నేను ఎప్పటికీ అతడికి రుణపడి ఉంటాను’ అని అన్నారు.
Srk about #Sanju baba 👌 pic.twitter.com/milKcMBORz
— Risheek (@risheek_king) July 2, 2018
'కొన్నేళ్ల క్రితం మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ నేను ఇంటికి వెళ్లి నిద్రపోయేవాడిని. ఉదయాన్నే లేచి ఆకలేస్తుంది అని కేక పెట్టేవాడిని. సర్వెంట్‌ని పిలిచి ఏదైనా తనకోసం టిఫిన్ రెడీ చేయమనేవాడిని. అతడు నన్ను చూసి ఏడ్చేవాడు. ఎందుకు ఏడుస్తున్నావ్ అని నేను అతడిని అడిగితే.. మీరు నిద్రలేచి రెండు రోజులైంది సార్ అనేవాడు. ఇది మీకు షాకైనా, నిజం' అని ఇటీవల ఒక ఛాట్‌షోలో సంజయ్ దత్ అన్నారు. ఈ సన్నివేశాలను సంజయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'సంజు' చిత్రంలో చూడవచ్చు.