ఆ పన్నెండేళ్ల కుర్రాడి పేరు భవ్య షా. ప్రపంచ ప్రఖ్యాత వజ్రాల వ్యాపారి అయిన దీపేష్ షా కుమారుడైన ఈ బాలుడు కనీవినీ ఎరుగని రీతిలో ఓ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. కొన్ని వేల కోట్ల రూపాయలకు వారసుడై కూడా.. వాటినన్నింటినీ త్యజించి సర్వసంగ పరిత్యాగిలా మారాలని భావించాడు. అదే విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పాడు. జైన సన్యాసిగా మారాలని అనుకుంటున్నానని తన మనసులోని మాటలను బయటపెట్టాడు.
తొలుత తన కుమారుడి నిర్ణయంతో ఏకీభవించకపోయినా.. ఆ తర్వాత తన నిర్ణయానికి వారే మద్దతివ్వడం విశేషం. ఈ క్రమంలో భవ్య షా దాదాపు 450 జైన సన్యాసుల సమక్షంలో దీక్ష తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా దేవుడు చూపించిన దారిలో నడవడానికి నిశ్చయించుకున్నట్లు తెలిపాడు.
"ఇదే నిజమైన దారి. ఐహిక బంధాలను వదిలి ఈ దారిలో ఎప్పుడో ఒక రోజు ఎవరైనా ప్రయాణించాల్సిందే. నా తల్లిదండ్రులు కూడా ఏదో ఒక రోజు ఈ దారిలో ప్రయాణించాల్సిందే. కానీ వారి కంటే ముందే నేను ఈ దారిని ఎంచుకున్నాను" అని తెలిపాడు భవ్య షా.
ఇదే విషయంపై ఆయన తండ్రి కూడా స్పందించారు. "నా కుమారుడు ఎందులోనైతే సంతోషం ఉందని భావిస్తున్నాడో దానిని అతనికి అందివ్వడం మా కర్తవ్యం. తన సంతోషమే మా సంతోషం" అని తెలిపారు. జైన సన్యాసులుగా మారేవారి జీవన విధానం పూర్తి వైవిధ్యంగా ఉంటుంది. వారు చాలా సాధారణమైన జీవనం గడపాలి. కేవలం భిక్షాటన మీదే ఆధారపడాలి.