మెగా హీరో వరుణ్ తేజ్ గెటప్ మార్చి హరీష్ శంకర్ తో ‘వాల్మీకి’ చేసాడు. తమిళ్ ‘జిగర్తాండ’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా కోర్టు ఆదేశం మేరకూ నిన్న టైటిల్ మార్చుకొని ‘గద్దల కొండ గణేష్’ గా ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమాతో వరుణ్ ఎలాంటి హిట్ అందుకున్నాడు. అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే మరి.
కథ :
ఎప్పటికైనా దర్శకుడవ్వాలనుకునే అభి (అథర్వ మురళి) ఆ దిశగా ప్రయత్నిస్తుంటాడు. తన టాలెంట్ తో ఓ నిర్మాతను ఆకర్షించి సినిమా అవకాశం అందుకుంటాడు. తన సినిమా ద్వారా ఓ విలన్ ని హీరోగా చూపించాలని చూస్తాడు. అందులో భాగంగా గ్యాంగ్ స్టర్ కోసం వెతుకుంతుంటాడు అభి. ఆ సమయంలో అతనికి గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్) గురించి తెలుస్తుంది. అతని జీవితం ఆధారంగా సినిమా తీయాలని ఫిక్స్ అయి కథ రాసుకోవడం మొదలు పెడతాడు.
మరోవైపు అతనికి ఎదురు తిరిగే వారిని, అతని గురించి ఆరా తీసేవారిని చంపుతూ ఉంటాడు గణేష్. చివరికి నానా తంటాలు పడి గణేష్ ని కలిసి అతని జీవితంలో జరిగిన సంగటనలు తెలుసుకుంటూ కథ సిద్దం చేస్తాడు అభి. ఈ క్రమంలో అభి గణేష్ దగ్గర ఉండే బుజ్జమ్మ ప్రేమలో పడతాడు. బుజ్జమ్మ కూడా అతన్ని ఇష్టపడుతుంది.అయితే తన రౌడీయిజంతో అందరినీ భయపట్టే గద్దలకొండ గణేష్ జీవితం ఆదరంగా తీసుకొని సినిమా చేయాలని చూసిన అభి చివరికి తన కల నేరువేర్చుకున్నాడా..? సినిమా ప్రయాణంలో గద్దలకొండ గణేష్ మరాడా..లేదా ? అన్నది మిగతా కథ.
నటీ నటుల పనితీరు :
డిఫరెంట్ మేకోవర్ తో విడుదలకు ముందే అందరినీ ఎట్రాక్ట్ చేసిన వరుణ్ తేజ్ సినిమాలో నటనతో మెస్మరైజ్ చేసాడు. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ వరుణ్ నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం ఒకేత్తైతే దాన్ని అందరూ మెచ్చేలా చేయడం మరో ఎత్తు. ఈ విషయంలో మెగా హీరోని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అధర్వ మురళి నటనతో పరవాలేదు అనిపించుకున్నాడు. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో సిద్దార్థ్(తమిళ్) ను అందుకోలేకపోయాడు. పూజా హెగ్డే కనిపించింది కాసేపే అయినా అందంతో శ్రీదేవిగా ఆకట్టుకుంది. మృణాళిని రవి తన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది.
సుప్రియ పాఠక్ , తనికెళ్ళ భరణి ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించారు. సత్య పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో అలరించాడు. కొన్ని కామెడీ సన్నివేశాల్లో సత్య కామెడీ బాగా నవ్వించింది. బ్రహ్మాజీ రోల్ చిన్నదే అయినా ఆ సన్నివేశాలు బాగా పేలాయి. శత్రు, అన్నపూర్ణమ్మ, ప్రభాస్ శ్రీను, రచ్చరవి , దేవి ప్రసాద్ ,నాగినీడు తదితరులు క్యారెక్టర్స్ కి బెస్ట్ ఛాయిస్ అనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు :
సినిమాకు అయనంకా బోస్ సినిమాటోగ్రఫీ హైలైట్ గా నిలిచింది. తన కెమెరా వర్క్ తో సినిమాను కథకు తగ్గట్టుగా సినిమాను చిత్రీకరించాడు. కొన్ని షాట్స్ ప్రేక్షకులను ఆకర్షించాయి. మిక్కీ సంగీతం అందించిన పాటల్లో ‘వక వక’,’జర్రా జర్రా’,ఎల్లువొచ్చి’ పాటలు ఆకట్టుకున్నాయి. పాటలకు చంద్రబోస్, వనమాలి,భాస్కరభట్ల సాహిత్యం చక్కగా కుదిరింది. కొన్ని సందర్భాల్లో నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. రెండో భాగంలో ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్ సినిమాకు ప్లస్ అయ్యింది. అప్పటి వాతవారణాన్ని క్రియేట్ చేయడంలో ఆర్ట్ డైరెక్టర్ గా అతని ప్రతిభ స్క్రీన్ పై కనిపించింది.
కొన్ని సందర్భాల్లో వచ్చే మాటలు అలరించాయి. కొన్ని సన్నివేశాలను దర్శకుడిగా బాగా తెరకెక్కించాడు హరీష్ శంకర్. నటీ నటులను కూడా ఉన్నంతలో బాగానే వాడుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
సమీక్ష :
ఐదేళ్ళ తర్వాత తమిళ్ లో హిట్టైన ‘జిగర్తాండ’ను తెలుగులో ‘గద్దలకొండ గణేష్’గా తెరకెక్కించి ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ అనే రీమేక్ సినిమా చేసి రీమేక్ డైరెక్టర్ గా మంచి పేరుతెచ్చుకున్న హరీష్ ఈసారి ఆ మేజిక్ ని రిపీట్ చేయలేకపోయాడు. ‘గబ్బర్ సింగ్’ లో చేసిన మార్పులు సినిమాను బ్లాక్ బస్టర్ గా మలిస్తే ఇప్పుడు ఈ సినిమాలో చేసిన మార్పులు ‘గద్దలకొండ గణేష్’ను ఓ సాదా సీదా ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాయి.
కార్తీక్ సుబ్బరాజు తీసిన ‘జిగర్తాండ’ ను హరీష్ శంకర్ తన స్టైల్ లో తీసి కొంత వరకూ మెప్పించగలిగాడు. కాకపోతే అసలు కథను మార్చిన విధానం బెడిసికొట్టింది. ‘జిగర్తాండ’ లో వేరే ఆప్షన్ లేక నిర్మాత ఆదేశం మేరకూ ఓ రౌడీను వెతుక్కుంటూ వెళ్తాడు సిద్దార్థ్. తెలుగుకి వచ్చే సరికి అధర్వనే ఓ విలన్ ను హీరోగా పెట్టి సినిమా తీయాలని నిర్ణయించుకొని నిర్మాతకు చెప్తాడు. ఇలా మార్చడం వల్ల హీరో క్యారెక్టర్ తాలూకు భయం కనిపించదు. పులి బోనులోకి వెళ్ళాలని డిసైడ్ అయితే అందులో అడుగుపెట్టిన వ్యక్తికి భయం ఏముంటుంది..? అందులో కామెడీ ఎలా పుడుతుంది.. ? అదే పులి అంటే చచ్చేంత భయం ఉండి ఎవరో నెట్టడం వల్ల ఆ బోనులోకి అడుగుపెడితేనే కదా అసలు మజా వచ్చేది కామెడీ పండేది. ఇక్కడే హరీష్ శంకర్ రాంగ్ స్టెప్ వేసాడు. ముఖ్యంగా తమిల్ లో కార్తీక్ సుబ్బరాజు బాబీ సిన్హా క్యారెక్టర్ తో ఓ కామెడీ సినిమా చేయించి ఆ సన్నివేశాలతో నవ్విస్తే, హరీష్ శంకర్ ‘సిటీ మార్’ అంటూ గద్దలకొండ గణేష్ బయోపిక్ సినిమాలా తెర్చిదిద్దిన తీరు పెద్దగా ఎట్రాక్ట్ చేసి నవ్వించదు. ఇలా కాకుండా ఆ విషయంలో కార్తీక్ సుబ్బరాజు నే ఫాలో అయితే సినిమాలో ఇంకాస్త కామెడీ పండేది.
తమిళ్ లో బాబీ సిన్హా చేసిన రోల్ ని తెలుగులో వరుణ్ తో చేయించడంలో హరీష్ డేరింగ్ అనిపిస్తే ఆ క్యారెక్టర్ ని ఎప్పుకొని ఓ ఛాలెంజింగ్ గా తీసుకొని చేయడం వరుణ్ తేజ్ పై నటుడిగా గౌరవం పెంచేలా చేస్తుంది. ఇప్పటి వరకూ వరుణ్ తేజ్ ఎంచుకున్న పాత్రలు ఒకేత్తైతే గద్దలకొండ గణేష్ పాత్ర మరో ఎత్తనే చెప్పాలి. ఈ రోల్ లో మరో నటుడ్ని ఊహించుకోలేనంతలా బెస్ట్ ఇచ్చాడు మెగా ప్రిన్స్. సినిమాను వన్ మెన్ షో లా ముందుకు నడిపించాడు కూడా.
కొన్ని సందర్భాల్లో మన నటీ నటులతో కామెడీ పండించడంలో సక్సెస్ అయ్యాడు హరీష్. వరుణ్ తేజ్ విలనిజం చూపిస్తూ వచ్చే సన్నివేశాలను కూడా బాగా తెరకెక్కించాడు. అలాగే సినిమా మేకింగ్ గురించి సినిమాను ప్రాణంలా భావించే వ్యక్తుల గురించి తనికెళ్ళ భరణి , బ్రహ్మానందం పాత్రలతో గొప్పగా చెప్పే ప్రయత్నం చేసాడు. చాలా సందర్భాల్లో సినిమా గొప్పతనాన్ని తెలియజేసాడు. ఇక తమిళ్ సినిమాతో పోలిస్తే తెలుగులో చేసిన మార్పులు, లవ్ ట్రాక్ సినిమాకు మైనస్ అనిపించాయి. అలాగే రెండో భాగంలో కొన్ని సన్నివేశాలను సాగదీసిన విధానం కూడా బోర్ కొట్టిస్తుంది. వరుణ్ తేజ్ నటన , కామెడీ సన్నివేశాలు , సినిమాటోగ్రఫీ ,ఆర్ట్ వర్క్ సినిమాలో హైలైట్స్ కాగా కథలో చేసిన మార్పులు, రెండో భాగంలో మరీ సాగ దీసినట్టుగా అనిపించే సన్నివేశాలు, నిడివి మైనస్ అనిపిస్తాయి. ఫైనల్ గా వరుణ్ తేజ్ కోసం, కొన్ని కామెడీ సన్నివేశాల్ కోసం ‘గద్దలకొండ గణేష్’ చూడొచ్చు.
నటీ నటులు : వరుణ్ తేజ్, అధర్వ మురళి, పూజా హెగ్డే , మృణాళిని రవి, బ్రహ్మాజి, తణికెళ్ల భరణి, సత్య, రచ్చరవి తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్
కథ: కార్తీక్ సుబ్బరాజ్
స్క్రీన్‌ప్లే: మధు, మిథున్ చైతన్య
ఆర్ట్: అవినాష్ కొల్ల
ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్.
నిడివి : 173 నిమిషాలు
విడుదల తేది : 20 సెప్టెంబర్ 2019
రేటింగ్ : 2.75/5