అలా మొదలైంది.. ఆలు చిప్స్

ప్రపంచంలో అందరూ ఆవురావురు మంటూ తినే స్నాక్స్ ఆలు చిప్స్ అనుకోకుండా పుట్టింది.

Last Updated : Aug 1, 2018, 04:16 PM IST
అలా మొదలైంది.. ఆలు చిప్స్

ప్రపంచంలో అందరూ ఆవురావురు మంటూ తినే స్నాక్స్ ఆలు చిప్స్ అనుకోకుండా పుట్టింది. ఒక సంప్రదాయ కథ ప్రకారం, న్యూయార్క్‌లోని ఓ రిసార్ట్‌లో జార్జ్ క్రమ్ 1853లో ఓసారి చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ సన్నగా ఉన్నాయని ఓ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. తాను బాగా చేశానన్న కస్టమర్ వెనక్కు తగ్గకపోవడంతో.. తనకో గుణపాఠం నేర్పాలని అనుకున్నాడు. బంగాళాదుంపలను వీలైనంత సన్నని ముక్కలుగా కోసి, కరకరలాడే వరకు వేయించి, దానిపై ఉప్పు చల్లి ఇచ్చాడు. ఇవి భలే రుచిగా ఉన్నాయని అతడు తినగా మొదట ఆశ్చర్యం వేసింది. ఆతర్వాత ఈ కొత్త రకం చిప్స్‌ను కస్టమర్లు ఇష్టపడటంతో.. రిసార్ట్ 'సరటోగా చిప్స్'గా మెనూలోకెక్కింది. ఆతర్వాత జోరుగా అమ్మకాలూ పెరిగాయి.  

19వ శతాబ్దంలో ఆలు చిప్స్ గిరాకీ బాగా పెరిగింది. రుచిలో కూడా మార్పులు వచ్చాయి. క్రిస్ప్స్, చీజ్, ఆనియన్ మరియు సాల్ట్, వినెగర్ రకాలు తయారుచేశారు. 20వ శతాబ్దంలో అడుగుపెట్టేసరికి బంగాళాదుంప చిప్స్ చెఫ్ వండే రెస్టారెంట్ పరిధిని దాటి ఇళ్లలో వండుకొనే వరకు వచ్చింది. మొదట్లో మార్కెట్లలో చిప్స్ టిన్లలో, షాప్ ముందు గాజు సీసాల్లో పెట్టి అమ్మేవారు. అలా తెరుస్తూ.. మూస్తూ ఉండటం వల్ల అడుగున ఉన్న చిప్స్ మెత్తబడి, పొడిగా మారేవి. ఆతర్వాత మైనపు కాగితాన్ని ఇస్త్రీ చేసి బ్యాగు రూపంలో తయారుచేసి వాటిలో చిప్స్‌ నింపేవారు. ఈ పద్ధతి ద్వారా చిప్స్ నలిగిపోవడం తగ్గింది. ఎక్కువ సమయం పాటు చిప్స్ తాజాగా, కరకరలాడుతూ ఉండేవి. తదనంతరం ప్యాకింగ్ రంగంలో వచ్చిన మార్పుల ఫలితంగా.. ఈనాడు, చిప్స్ ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు నత్రజని వాయువును నింపిన ప్లాస్టిక్ బ్యాగులలో ప్యాక్ చేస్తున్నారు. అదండీ.. ఈ ఆలు చిప్స్ కహాని.

Trending News