కమల్ హాసన్, అజయ్ దేవగన్ కలిసి నటిస్తున్నారట

తమిళ అగ్ర కథానాయకుడు, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట.

Last Updated : Aug 7, 2018, 12:03 AM IST
కమల్ హాసన్, అజయ్ దేవగన్ కలిసి నటిస్తున్నారట

తమిళ అగ్ర కథానాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. ఇటీవలే కమల్ ఇదే విషయం మీద మాట్లాడుతూ.. తనకూ ఈ మధ్యనే ఈ విషయం తెలిసిందని.. ఏదైనా దర్శకుడి నిర్ణయమని తెలిపారు. కమల్ హీరోగా నటిస్తున్న ‘భారతీయడు 2’లో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారట. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం ‘భారతీయడు’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

తెలుగుకి సంబంధించి ఈ చిత్రం హక్కులను దిల్ రాజు తీసుకున్నారని.. లైకా ప్రొడక్షన్స్ సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని వార్తలు వస్తున్నాయి. నయనతార గతంలో ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే..అది ఎంతవరకు నిజమో తెలియదు. ప్రస్తుతం కమల్ తన సొంత సినిమాయైన ‘విశ్వరూపం 2’ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చాలావరకు బిజీగా ఉన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో ఆయన మక్కల్ నీది మయ్యమ్ అనే పొలిటికల్ పార్టీని కూడా ప్రారంభించారు. 

కమల్ హాసన్ 1996లో నటించిన "ఇండియన్" చిత్రం భారతీయుడు పేరుతో తెలుగులో విడుదలైంది. అలాగే "హిందుస్తానీ" పేరుతో హిందీలో కూడా డబ్ అయ్యింది. భారతదేశం నుండి ఈ సినిమా అధికారిక ఎంట్రీగా కూడా ఆస్కార్ నామినేషన్లకు వెళ్లడం విశేషం. ఇప్పుడు ఇదే సినిమాకి సీక్వెల్‌‌గా ‘భారతీయడు 2’ వస్తుండడంతో ఈ చిత్రంపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళనాడులో రజనీకాంత్ నటించిన బాషా, నరసింహ సినిమా రికార్డులను భారతీయుడు  తిరగరాసింది. అలా తెలుగు, హిందీల్లో కూడా ఈ సినిమా హిట్ చిత్రంగా నిలిచింది. 

Trending News