Muhammad, the messenger of God: ముహమ్మద్ అనే టైటిల్‌తో తెరకెక్కిన వివాదాస్పద చిత్రం విడుదలపై మహారాష్ట్ర సర్కార్ నిషేధం విధించింది. ఈ నెల 21న ఆన్లైన్ థియేటర్ పోర్టల్ డాన్ సినిమాస్‌లో ( Don cinemas ) ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా.. అంతకంటే ముందుగానే మహారాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra govt ) ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా డాన్ సినిమాస్ పోర్టల్‌ని సైతం మూసేయాల్సిందిగా మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. ముహమ్మద్ చిత్రం ఇస్లాం మత సంప్రదాయాలను, విశ్వాసాలను కించపరిచేదిగా ఉన్నందున ఆ చిత్రం విడుదల నిలిపేయాల్సిందిగా కోరుతూ ఇటీవలే రజా అకాడమి ( Raza academy ) సైతం మహారాష్ట్ర సర్కార్‌కి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ముహమ్మద్ అనే టైటిల్‌తో రూపొందిన ఈ సినిమాకు ది మెసేంజర్ ఆఫ్ గాడ్ క్యాప్షన్‌గా పెట్టారు.
మజిద్ మజిది డైరెక్ట్ ( Director Majid majidi ) చేసిన ఈ చిత్రానికి చెందిన ప్రమోషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతున్నాయని.. ఈ చిత్రం ఇస్లాం మతం సెంటిమెంట్స్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉందని పేర్కొంటూ ఇటీవలే మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ కేంద్రానికి ఓ లేఖ కూడా రాసింది.
ఇదిలావుంటే, ఈ చిత్రం విడుదలను నిలిపేయాల్సిందిగా కోరుతూ రజా అకాడమి బృందం డాన్ సినిమాస్ ఆన్లైన్ థియేటర్ పోర్టల్ యజమాని మహ్మూద్ అలీని ( Don Cinema owner Mahmood Ali ) కోరింది. అయితే, వారి విజ్ఞప్తిని తోసిపుచ్చిన మహ్మూద్ అలీ.. తమకు ఈ చిత్రానికి సంబంధించిన కాపీ రైట్స్ ఉన్నాయని, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని అన్నారు. మీరు ఆపగలిగితే ముందుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను నిలువరించండి అంటూ అకాడమి సభ్యులకు బదులిచ్చారు.
ముహమ్మద్ చిత్రం లాంటి సినిమాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వచ్చాయి. అవి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఆ చిత్రాలకు లేని అడ్డంకులు ఈ చిత్రానికి ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని మహ్మూద్ అలీ విస్మయం వ్యక్తంచేశారు. అంతేకాకుండా ఈ సినిమా విడుదలపై మహారాష్ట్ర హోంమంత్రి అపాయింట్మెంట్ కూడా తీసుకుని మాట్లాడుతానని అన్నారు.
హిందీలో మాత్రమే విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఎ.ఆర్.రహ్మాన్ మ్యూజిక్ ( A.R. Rahman`s music ) కంపోజ్ చేశారు.