కొత్త కోడళ్ళకు ఈ కోర్సు ప్రత్యేకం.. యూనివర్సిటీలో 3 నెలల శిక్షణ

భోపాల్‌లోని బర్కతుల్లా యూనివర్సిటీ తమ విశ్వవిద్యాలయంలో ఓ సరికొత్త కోర్సుకి శ్రీకారం చుట్టింది. 

Updated: Sep 14, 2018, 08:26 PM IST
కొత్త కోడళ్ళకు ఈ కోర్సు ప్రత్యేకం.. యూనివర్సిటీలో 3 నెలల శిక్షణ
Representational Image

భోపాల్‌లోని బర్కతుల్లా యూనివర్సిటీ తమ విశ్వవిద్యాలయంలో ఓ సరికొత్త కోర్సుకి శ్రీకారం చుట్టింది. నవ వధువులు అత్తారింటికి వెళ్లేటప్పుడు అక్కడ ఎలా మసలుకోవాలి? ఏ విధంగా తమ నైపుణ్యాలతో ఆకట్టుకోవాలి? మొదలైన విషయాలను తెలుపుతూ.. తాము ఈ కోర్సు ద్వారా శిక్షణ ఇస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. వనితా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైన్ గతంలో ఇదే కోర్సును ఆఫర్ చేయగా.. వారి ప్రేరణతో బర్కతుల్లా యూనివర్సిటీ కూడా ఈ కోర్సును ప్రారంభించింది. "ఆదర్శ కోడలిగా పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి" అన్న ప్రశ్నకు ఈ కోర్సులో అంశాలు సమాధానాలు చెబుతాయని అంటున్నారు యూనివర్సిటీ శిక్షకులు.

ఈ కోర్సును ఆయా యూనివర్సిటీకి చెందిన సైకాలజీ, సోషియాలజీ, విమెన్ స్టడీస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు నిర్వహిస్తారని బర్కతుల్లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తెలిపారు. ఈ కోర్సు నిర్వహణను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నామని ఆయన అన్నారు. కొత్త వధువులకు కమ్యూనికేషన్ స్కిల్స్‌‌తో పాటు మర్యాదగా నడుచుకొనే పద్ధతి, ఆచార వ్యవహారాల పట్ల అవగాహన మొదలైనవాటిని అలవాటు చేయడం ఈ కోర్సు ఉద్దేశమని కూడా యూనివర్సిటీ అధ్యాపకులు చెప్పడం గమనార్హం.

ఇదే కోర్సును గతంలో ప్రారంభించిన వనితా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైన్ సీఈఓ నీరజ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ "కుటుంబ బంధాలను పటిష్టం చేసుకోవడానికి కూడా కొన్ని స్కిల్స్ అవసరం. మంచి పేరు తెచ్చుకోవాలన్నా, అత్త మామలు తమను ఇష్టపడేటట్లు చేసుకోవాలన్నా, వివాహ బంధంలోని మధురిమలను ఆస్వాదించాలన్నా కొన్ని స్కిల్స్ అవసరం. అలాంటి స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చే కోర్సుల అవసరం ఈ రోజు ఎంతో ఉంది. ఈ రోజు చదువుకున్న అమ్మాయిల్లో కూడా 70 శాతం మంది వివాహమయ్యాక ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అలాంటి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి జీవితంలో కూడా గెలిచేలా చేయడమే మా లక్ష్యం" అని శ్రీవాస్తవ అన్నారు.