'పద్మావత్'పై ప్రతీకారమా : దర్శకుడి తల్లిపై కర్ణిసేన సినిమా !

తాము తల్లిగా భావించే పద్మావతిపై సంజయ్ లీలా భన్సాలీ సినిమాను తెరకెక్కించి ఆమెని అవమానించాడు : కర్ణిసేన

Last Updated : Jan 27, 2018, 07:59 PM IST
'పద్మావత్'పై ప్రతీకారమా : దర్శకుడి తల్లిపై కర్ణిసేన సినిమా !

పద్మావత్ సినిమాను మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోన్న రాజ్‌పుత్ కర్ణిసేన సామాజికవర్గం ఆ సినిమాను అడ్డుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. కర్ణిసేన మనోభావాలని దృష్టిలో వుంచుకుని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా విడుదల చేయడానికి సైతం వెనకడుగేశాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా అనిపించిందో అర్థం చేసుకోవచ్చు. 

అయితే, పద్మావత్ నిర్మాతలు సుప్రీం కోర్టుకి వెళ్లడం, సుప్రీం కోర్టు తీర్పుతో ఆ సినిమా దేశవ్యాప్తంగా విడుదలవడం అనేది కర్ణిసేన వర్గాన్ని తీవ్రంగా కలచివేసింది. సినిమా విడుదలను అడ్డుకుంటూ పలుచోట్ల థియేటర్లపై రాళ్లదాడులకి పాల్పడిన ఆ వర్గానికి చెందిన నిరసనకారుల ఆగ్రహం అప్పటికీ చల్లారలేదు. అందుకే పద్మావత్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తల్లిపై సినిమాను తెరకెక్కించి తాము చెప్పాలనుకున్నది చెప్పి తీరుతాం అని ప్రకటించింది కర్ణిసేన.

నిన్న రాజస్థాన్‌లోని చిత్తర్‌ఘడ్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆ జిల్లా కర్ణిసేన విభాగం అధ్యక్షుడు గోవింద్ సింగ్.. సంజయ్ లీలా భన్సాలీ తల్లిపై తాము ఓ సినిమాను తెరకెక్కించనున్నట్టు తెలిపారు. "ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైంది. సినిమాకు 'లీలా కీ లీలా' అనే పేరు ఖరారు చేశాం. అరవింద్ వ్యాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. ఓ ఏడాది వ్యవధిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం" అని గోవింద్ సింగ్ ప్రకటించారు. "తాము తల్లిగా భావించే పద్మావతిపై సంజయ్ లీలా భన్సాలీ సినిమాను తెరకెక్కించి ఆమెని అవమానించాడు. కానీ తాము సంజయ్ లీలా భన్సాలీ తల్లిపై తెరకెక్కించే సినిమా చూస్తే, అతడు గర్వపడేలా వుంటుంది" అని గోవింద్ స్పష్టంచేశాడు. 

Trending News