ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజాల్లో ఒకటైన షేర్ చాట్ తమ టైమ్‌లైన్‌లోంచి 4 లక్షల 87 వేల పోస్టులను తొలగించినట్టు ప్రకటించింది. నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు షేర్ చాట్ స్పష్టంచేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి నడుచుకుంటామని స్వతంత్రంగా ఏర్పాటు చేసుకున్న నియమావళిని అనుసరించే క్రమంలోనే షేర్ చాట్ ఈ పోస్టులను తొలగించింది. ఇవేకాకుండా 54,404 ఖాతాలను సైతం తొలగించినట్టు సంస్థ స్పష్టంచేసింది.
ఎవరైనా వ్యక్తులు, లేదా సంస్థలు, రాజకీయ పార్టీలను లక్ష్యంగా చేసుకుని వారి పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న వారి ఖాతాలు, పోస్టులనే తొలగించినట్టు షేర్ చాట్ సంస్థ తాజా ప్రకటనలో పేర్కొంది. తొలగించిన పోస్టులలో 13,195 పోస్టులు రాజకీయాలు, వార్తల విభాగానికి చెందినవేనని సంస్థ తెలిపింది.