పోలీసులను హీరోలుగా చూపిస్తూ ఇప్పటి వరకూ తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో ఎన్నో సినిమాలు తీశారు. అయితే అందులో సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచి.. తిరుగులేని పోలీస్ పాత్రలకు ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేసిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలనాటి ఎన్టీఆర్ దగ్గర నుండి నేటి పవన్ కళ్యాణ్ వరకూ పోలీస్ పాత్రలకు న్యాయం చేసిన కథానాయకులెందరో ఉన్నారు. అలాగే గొప్ప గొప్ప పోలీస్ కథలతో వచ్చిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాలలో కొన్ని ఆణిముత్యాల వంటి సినిమాల గురించి ఈ వ్యాసం మీకోసం ప్రత్యేకం.
కొండవీటి సింహం - 1981లో విడుదలైన కొండవీటి సింహం చిత్రంలో ఎస్పీ రంజిత్ కుమార్ పాత్రలో ఎన్టీఆర్ తన నటన విశ్వరూపాన్ని చూపించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిజాయతీ గల పోలీసాఫీసర్ పాత్రలో ఆయన ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్లో వచ్చిన పోలీస్ సినిమాల్లో కొండవీటి సింహం చిత్రానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందనడంలో అతిశయోక్తిలేదు.
కర్తవ్యం - 1990లో మోహనగాంధీ దర్శకత్వంలో విజయశాంతి నటించిన "కర్తవ్యం" చిత్రం పోలీస్ చిత్రాలలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అవినీతి పరులైన రాజకీయ నాయకుల ఆట కట్టించే ఎస్పీ వైజయంతి పాత్రలో విజయశాంతి ఒదిగిపోయి నటించారు. ప్రముఖ పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీ జీవితాన్ని ప్రేరణగా తీసుకొని ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా విజయశాంతి జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకోవడం విశేషం. అలాగే ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులను కూడా విజయశాంతి ఈ చిత్రంలో పాత్రకు దక్కించుకున్నారు.
అంకుశం - 1989లో వచ్చిన "అంకుశం" పోలీస్ చిత్రాలలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన చిత్రంగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రిని చంపడానికి ప్రయత్నించే ముష్కరుల ఆటకట్టించడానికి ఓ పోలీస్ ఆఫీసర్ తన జీవితాన్ని పణంగా పెట్టి ఎలా పోరాడతాడన్నదే ఈ చిత్రకథ. ఇదే చిత్రం తమిళంలో "ఇతుడాంద పోలీస్" పేరుతో డబ్ చేయబడి అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇదే చిత్రాన్ని హిందీలో ప్రతిబంధ్ పేరుతో రీమేక్ చేయగా.. ఈ చిత్రంలో పోలీస్ పాత్రని మెగాస్టార్ చిరంజీవి పోషించారు.
ఎస్ పి పరశురామ్ - 1994లో విడుదలైన ఎస్పీ పరుశురామ్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించారు. తప్పు చేసేది తన కుటుంబంలోని వ్యక్తి అయినా సరే.. చట్టం ముందు అందరూ సమానమే అని నమ్మి అరెస్టు చేసే ముక్కుసూటి గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ చిత్రంలో చిరంజీవి నటించారు. చిరంజీవికి పోలీస్ పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, స్టేట్ రౌడీ లాంటి చిత్రాలలో తాను పోలీస్ పాత్రలు పోషించారు.
రక్షణ - అండర్ వరల్డ్ ముఠా నాయకుల ఆట కట్టించడానికి వైజాగ్ నుండి వచ్చే ఏసీపీ ఆఫీసర్ బోస్ పాత్రలో నాగార్జున ఈ చిత్రంలో నటించారు. అప్పటికే "నిర్ణయం" చిత్రంలో పోలీసాఫీసర్ పాత్ర పోషించిన నాగార్జున ఈ చిత్రంలో కూడా ఆ పాత్రలో చాలా సహజంగా నటించారు. ఈ సినిమా విడుదలైన కొన్నాళ్లకి "శివమణి" చిత్రంలో కూడా నాగార్జున పోలీస్ పాత్రలో నటించారు. ఇటీవలే రామ్ గోపాల్ వర్మ చిత్రం "ఆఫీసర్"లో కూడా పోలీస్ పాత్రలో దర్శనమిచ్చారు కింగ్ నాగార్జున. రక్షణ చిత్రం 1993లో విడుదలైంది.
రౌడీ ఇన్స్పెక్టర్ - నందమూరి బాలక్రిష్ణ నటించిన "రౌడీ ఇన్స్పెక్టర్" చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఎస్పీ రామరాజ్ పాత్రలో ఈ సినిమాలో బాలయ్య బాబు చెలరేగిపోయారు. బొబ్బర్లంక రాంబ్రహ్మం అనే అండర్ వరల్డ్ డాన్ (మోహనరాజ్) ఆట కట్టించే డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసరుగా ఈ చిత్రంలో బాలయ్య బాబు తన నటన విశ్వరూపం చూపించారు. బి.గోపాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ లాంటి చిత్రాలలో కూడా నందమూరి బాలక్రిష్ణ పోలీస్ పాత్రలలో తన అభిమానులను బాగా అలరించారు.
పోలీస్ స్టోరీ - 1996లో విడుదలైన "పోలీస్ స్టోరీ" చిత్రం కన్నడలో విడుదలైన చిత్రానికి తెలుగు డబ్బింగ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. థ్రిల్లర్ మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అన్యాయ, అక్రమాలను సహించని రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసరు అగ్ని పాత్రలో సాయికుమార్ తన నటన విశ్వరూపాన్ని చూపించారు. ఈ చిత్రంలో డైలాగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన "పోలీస్ స్టోరీ" చిత్రం ఎన్నో రికార్డులను బ్రేక్ చేయడం విశేషం.
ఘర్షణ - 2004లో విక్టరీ వెంకటేష్ నటించిన "ఘర్షణ" చిత్రం పోలీస్ చిత్రాలలో ఒక వినూత్నమైన టేకింగ్ గల చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో ఏసీపీ రామచంద్ర పాత్రలో వెంకటేష్ చాలా సహజంగా నటించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించారు. ఈ చిత్రం కంటే ముందు సూర్య ఐపీఎస్ అనే చిత్రంలో వెంకటేష్ పోలీస్ పాత్రలో నటించారు.
విక్రమార్కుడు -2006లో వచ్చిన "విక్రమార్కుడు" చిత్రంలో రవితేజ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో చాలా డిఫరెంట్‌గా నటించారు. ఇదే చిత్రం హిందీలో "రౌడీ రాథోడ్" పేరుతో రీమేక్ చేయబడింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన "విక్రమార్కుడు" చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
దూకుడు - మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన "దూకుడు" చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం కంటే ముందు పోకిరి చిత్రంలో మహేష్ పోలీస్ ఆఫీసరుగా నటించారు. తర్వాత "ఆగడు" చిత్రంలో కూడా టైటిల్ రోల్ పోషించారు.
గబ్బర్ సింగ్ - 2012లో పవన్ కల్యాణ్ నటించిన "గబ్బర్ సింగ్" చిత్రం తన కెరీర్లోనే బెస్ట్ మాస్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో ఎస్సై వెంకటరత్నం నాయుడు పాత్రలో పవన్ కళ్యాణ్ చాలా చురుగ్గా, జోవియల్‌గా నటించారు. దాదాపు రూ.100 కోట్లకు పైగానే వసూళ్లను ఈ చిత్రం సాధించింది.
టెంపర్ - 2015లో వచ్చిన "టెంపర్" చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కరెప్టెడ్ పోలీస్‌గా నటించారు. అయితే అవినీతికి అలవాటు పడిపోయిన అదే పోలీస్ తన జీవితంలో ఎదురైన పరిస్థితుల వల్ల ఎలా నిజాయతీ గల వ్యక్తిగా మారాడన్నదే చిత్రకథ. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.
ధ్రువ - 2016లో వచ్చిన ఈ చిత్రంలో ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ధ్రువగా రామ్ చరణ్ నటించారు. తమిళ చిత్రం "తని ఒరువన్"కి ఈ చిత్రం రీమేక్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలవడం విశేషం.
మరెందరో హీరోలు - ఇంకా చెప్పాలంటే పోలీస్ పాత్రలు పోషించిన హీరోలు చాలామంది ఉన్నారనే చెప్పాలి. జగపతిబాబు (సిద్ధం), గోపిచంద్ (గోలీమార్), శ్రీకాంత్ (ఆపరేషన్ దుర్యోధన), శ్రీహరి (పోలీస్) లాంటి హీరోలు కూడా పోలీసులుగా తమ నటన విశ్వరూపం చూపించారు.