Home Remedies for Platelets: ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నాయా..! ప్లేట్‌లెట్స్ కౌంట్ పెంచే చిట్కాలు మీకోసం..

Home Remedies for Platelets: సీజన్ మారింది.. వైరల్ ఫీవర్స్ పెరిగిపోతున్నాయి. ఓ వైపు కరోనా వైరస్ తో జనాలు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ఈ కారణంగా ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గుతుంది. అయితే, వీటిని పెంచుకునేందుకు నిపుణులు కొన్ని ఆహారపదార్థాలను సూచిస్తున్నారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 5, 2021, 02:26 PM IST
Home Remedies for Platelets: ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నాయా..! ప్లేట్‌లెట్స్ కౌంట్ పెంచే చిట్కాలు మీకోసం..

Home Remedies for Platelets: ఓ వైపు కరోనా వైరస్(Coronavirus)తో ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు సీజనల్ వ్యాధులు మేమున్నామంటూ వచ్చేశాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా డెంగ్యూ(Dengue) ఫీవర్ బాధితులే కనిపిస్తున్నారు. దీంతో చాలా మందిలో ప్లేట్ లెట్స్ సంఖ్య(Platelets Count) తగ్గి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్లేట్ లెట్స్ అతి చిన్న కణాలు.. రక్తం గడ్డ కట్టడానికి రక్త స్రావాన్ని ఆపడానికి సహాయపడతాయి. మన శరీరంలో వీటి జీవితకాలం.. 5 నుంచి 9 రోజులు. ఈ ప్లేట్ లెట్స్ తగ్గితే.. ప్రాణాపాయ స్థితి కూడా చేరుకుంటారు.. కనుక వంటింట్లోని పలు చిట్కాలతో ప్లేట్ లెట్స్ సంఖ్యను ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం.

బొప్పాయి, బొప్పాయి ఆకులు
బొప్పాయిలో మంచి ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ప్లేట్ లెట్ల సంఖ్య(Platelets Count) తగ్గినప్పుడు వాటి సంఖ్యను పెంచుకోవడానికి బొప్పాయి, వాటి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. బాగా పండిన బొప్పాయిని తినాలి. ముఖ్యంగా బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల మన శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతాయి. అయితే బొప్పాయి ఆకు రసాన్ని తాగడం ఎవరికైనా కష్టమే.. అందుకనే ఈ రసంలో కొంచెం నిమ్మరసం కలుపుకుంటే తాగడానికి వీలుకలుగుతుంది. అయితే ఎక్కువ మొత్తంలో నిమ్మరసం కలుపుకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.. కనుక తగిన మోతాదులో మాత్రమే కలుపుకోవాలి. లేదంటే.. కొంచెం కష్టమైనా ఇష్టంగా బొప్పాయి ఆకు రసాన్ని తాగితే.. మంచిది.

క్యారెట్..
రక్తాన్ని పెంచే క్యారెట్.. ప్లేట్‌లెట్ కౌంట్‌ని కూడా పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్యతో బాధపడేవారు త్వరగా ఉపశమనం పొందారని తేలింది. ఈ క్యారెట్‌ని నేరుగానైనా, సలాడ్ రూపంలో నైనా ఎలా తీసుకున్నా ఫలితం ఉంటుంది.

కూర గుమ్మడి కాయ
వీటిల్లో ఉండే పోషకాలు ప్లేట్‌ లెట్లను ఉత్పత్తి చేయడంలో దోహదపడతాయి. గుమ్మడి కాయ, దాని విత్తనాలను తరచూ తీసుకుంటే శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

నిమ్మకాయ:
సి విటమిన్ అధికంగా ఉండే నిమ్మకాయ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రోజుకు రెండు సార్లు ఒక టీస్పూన్‌ నిమ్మరసం తాగితే ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

ఉసిరి:
దీనిలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్‌ మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను తాగితే మంచిది. లేదా ఉసిరికాయ పొడిని రోజుకు రెండు సార్లు ఒక టీస్పూన్‌ మోతాదులో తేనెతో కలిపి తీసుకుంటే ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

బీట్ రూట్:
శరీరంలోని ప్లేట్ లెట్ సంఖ్యను పెంచుతుంది.. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల మన శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు.

గోధుమ గడ్డి రసం:
గోధుమ గడ్డిలో అధికంగా క్లోరోఫిల్ ఉండటం వల్ల మన శరీరంలో ప్లేట్ లెట్లను పెంచడానికి సహాయ పడుతుంది. కనుక రోజూ ఉదయాన్నే పరగడుపునే అర కప్పు గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

పాలకూర:
పాలకూరలో ‘విటమిన్‌ కె’ అధికంగా ఉంటుంది. కనుక పాలకూర జ్యూస్‌ను రోజూ ఉదయం తాగడం వల్ల రక్తంలో ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

దానిమ్మ పండు:
దానిమ్మ పండ్లలో ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్‌ లెట్లను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అలాగే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దానిమ్మ పండు తిన్నా వాటి జ్యూస్‌ను తాగినా ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది. డాక్టర్లు కూడా దానిమ్మ పండ్లను తినాలని చెబుతుంటారు.

డ్రై కిస్ మిస్:
కిస్మిస్‌ల్లో ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడతాయి. ప్లేట్ లెట్లు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి, కనుక రోజూ రాత్రి గుప్పెడు కిస్మిస్‌లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తినాలి. దీని వల్ల ప్లేట్‌ లెట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

పాలు, పాలపదార్ధాలు:
పాలలో కాల్షియం , విటమిన్ డి , ఫోలేట్‌, బి12, విటమిన్‌ కె అధికంగా ఉంటాయి. కనుక పాలను రోజూ తాగితే ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు పాల పదార్ధాలైన చీజ్‌, పెరుగును కూడా తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News