గాంధీజీ చెప్పిన ఆరోగ్య పాఠాలు..!

Last Updated : Oct 2, 2017, 05:35 PM IST
గాంధీజీ చెప్పిన ఆరోగ్య పాఠాలు..!

మహాత్మాగాంధీ.. నిరాడంబరతకు, నిర్మలత్వానికి మారు పేరు ఆ పావనమూర్తి. "అందరూ విలువను బంగారంలోనూ, వెండిలోనూ వెతుక్కుంటారు. కానీ అసలైన విలువ అనేది మన ఆరోగ్యంలోనే ఉంటుంది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము" అని అంటారాయన. ఆధునిక కాలంలో అనేక విపరీతాలకు ఆలవాలమైన మన జీవనశైలి సరైన పంథాలో వెళ్ళాలంటే ఆ మహనీయుని మాటలు మనకు ఆచరణయోగ్యంగా ఉండాలి. ఈ రోజు మహాత్మాగాంధీ గురించి ప్రపంచమంతా తెలుసు. అహింస, సహాయ నిరాకరణోద్యమం లాంటి విషయాల్లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, బరాక్ ఒబామా లాంటి ఎందరో మేధావులకు ప్రేరణగా నిలిచిన గాంధీ జీవితంలో ఆరోగ్య పరిరక్షణ అంటే ఏమిటి? మంచి ఆరోగ్య అలవాట్లను పెంచుకోవడమెలా? లాంటి విషయాల మీద కూడా పలు ప్రస్తావనలు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం..!

ఉపవాసం - దాని ప్రాధాన్యం

భారత స్వాతంత్ర్య సమరం సాగుతున్న సమయంలో మహాత్మ గాంధీ అనేకసార్లు నిరాహారదీక్షను పాటించారు. దాదాపు 17 సార్లు ఉపవాసాన్ని ఒక వ్రతంగా స్వీకరించారు. అత్యధికంగా 21 రోజులు కేవలం తక్కువ మోతాదులో ద్రవాలను మాత్రమే తీసుకుంటూ నిరాహారదీక్ష చేశారు. తన అహింస సిద్దాంతాల్లో భాగంగా ఈ అంశం గురించి పేర్కొన్నారు. పలువురు ఆయుర్వేద వైద్య నిపుణులు కూడా సరైన విధానాల  ద్వారా ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిదే అని పేర్కొనడం జరిగింది. స్థూల కాయాన్ని తగ్గించుకోవడం, రక్తపోటును నియంత్రించుకోవడం, కొవ్వును తగ్గించుకోవడం లాంటివన్నీ కూడా పలు ఉపవాస నియమాల  వల్ల సాధ్యమే అని శాస్త్రం చెబుతోంది. ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నదాని ప్రకారం శరీరంలోని మూడు రకాల జీవశక్తులు వాత, పిత్త, కస లక్షణాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొంటారు.ఈ మూడు లక్షణాలు సమపాళ్ళల్లో పనిచేయాలి అంటే వైద్యులు చెప్పే రీతిలో ఉవవాస నియమాలను పాటించడం మంచిది. 

ఆహారపు అలవాట్లు

గాంధీజీ ఉద్దేశ్యంలో మంచి ఆహారపు అలవాట్లు అనేవి మంచి ఆరోగ్యానికి తప్పనిసరి అని భావించవచ్చు. ఒక్కో వ్యక్తి శరీరం దాని తత్వాన్ని బట్టి,  ఒక్కో రకమైన ఆహారానికి అలవాటు పడుతుంది. కాబట్టి, దానికి అనుగుణంగానే మనిషి ఆహారపు అలవాట్లు ఉంటాయి. అయితే, సందర్భానుసారం, అవసరమైనప్పుడు పౌష్టికత్వాన్ని పెంచుకోవడానికి ఆహారపు అలవాట్లను మార్చుకోవడంలో తప్పులేదు. గాంధీ తొలుత పాల పదార్థాలకు దూరంగా ఉండేవారు. కేవలం ఒక వెజిటేరియన్‌గానే ఉండాలని కోరుకొనేవారు. అయితే సమయానుసారం తన ఆహారపు అలవాట్లలో మార్పులు సంభవించాయి. వైద్యుడి సలహా  మేరకు మేక పాలను తన డైట్‌లో భాగంగా చేసుకున్నారు. అతని డైట్‌లో ఒక లీటరు మేక పాలు, 150 గ్రాముల చిరుధాన్యాలు, 75 గ్రాముల ఆకుకూరలు, 125 గ్రాముల కాయగూరలు, 25 గ్రాముల సలాడ్లు, 40  గ్రాముల నెయ్యి, 40 గ్రాముల పంచదార ఉండేటట్లు చూసుకున్నారు. 

ధ్యానం

మనిషి తన మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ప్రశాంతతను పెంపొందించుకోవడం కోసం ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలన్నది గాంధీ సిద్ధాంతం. ఆయన ప్రతీ రోజు ధ్యానం చేసేవారు. మరియు ఎక్కువ సేపు ప్రార్థన చేసేవారు. ఆయుర్వేదం ప్రకారం కూడా ధ్యానం చేయడం వలన మానసిక రుగ్మతలు దూరం అవుతాయని చెప్పుకోవచ్చు.

మరిన్ని విషయాలు

గాంధీజీ ప్రబోధించిన అనేక విషయాలను ఆరోగ్య వికాసానికి ముడిపెడితే కొన్ని మంచి విషయాలను తెలుసుకోవచ్చు. ఉదాహరణకు నిద్రలేమిని అరికట్టడం అనే విషయాన్ని చర్చిస్తే.. గాంధీ కూడా తొలుత కేవలం నాలుగు నుండి అయిదు గంటలు మాత్రమే నిద్రకు కేటాయించేవారు. అయితే తర్వాత రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉండకుండా, వేగంగా నిద్రపోవడం మరియు వేగంగా నిద్రలేవడం అనే  నియమానికి కట్టుబడి ఉండేవారు. సూర్యోదయానికి ముందు నిద్రలేచి ధ్యానం చేయడం వలన శరీరంలో ఒక ఉత్తేజం ప్రారంభమై, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండగలుగుతామని ఈ ఉదాహరణ చెబుతోంది. అలాగే దండీ మార్చ్ చేసిన బాపూజీ జీవితం నుండి ఆ అంశాన్ని ఉదాహరణగా తీసుకుంటే, నడక వలన కలిగే ఉపయోగాలు తెలుసుకోవచ్చు. గుండె బలహీనతను తగ్గించుకోవడం, కొవ్వు కరిగించుకోవడం, పక్కటెముకలు పటిష్టపడేలా చూసుకోవడానికి నడక ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ప్రతీ వ్యక్తి రోజుకు ఎంతోకొంత దూరం నడవడం తప్పనిసరిగా భావించాలి. 

Trending News