గుజరాత్‌లో ఇటీవలే టెన్త్, ఇంటర్ బోర్డులు నిర్వహించిన వార్షిక పరీక్షల్లో భారీస్థాయిలో మాల్ ప్రాక్టీసు జరిగింది. ఓ పరీక్షా కేంద్రంలో దాదాపు ప్రతీ విద్యార్థి వద్ద కొన్ని వందల స్లిప్పులు ఉన్నట్లు స్క్వాడ్ పసిగట్టింది. విద్యార్థులు టెక్స్ట్ బుక్కులను మెక్రో ఫోటోకాపీలుగా మార్చి పరీక్షా కేంద్రాలకు తీసుకురాగా.. వారందరినీ స్క్వాడ్ బుక్ చేసింది. వారి వద్ద నుండి స్లిప్పులను స్వాధీనం చేసుకుంది.
అలా దొరికిన స్లిప్పులను దాదాపు 20 చిన్న చిన్న బస్తాల్లో ప్యాక్ చేశారు. వాటి మొత్తం బరువు దాదాపు 200 కేజీలకు పైగానే ఉంటుందని తెలియడంతో అవాక్కవ్వడం విద్యాశాఖ వంతైంది. వంతలి టౌన్ పరిధిలోకి వచ్చే పరీక్షా కేంద్రంలో పన్నెండవ తరగతి సైన్స్ పరీక్ష జరుగుతున్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మార్చి రెండవ వారంలో జరిగిన ఈ పరీక్షలో విద్యార్థులు భారీ స్థాయిలో మాల్ ప్రాక్టీసుకు పాల్పడగా.. విద్యాశాఖ ఎంక్వయరీకి ఆదేశించింది.
కనీవినీ ఎరుగని ఈ మాల్ ప్రాక్టీసుకి స్వామినారాయణ్ గురుకుల్ అనే పరీక్షా కేంద్రం కేంద్రబిందువు కాగా .. ఆ కేంద్రానికి ఎగ్జామ్ కో ఆర్డినేటరుగా నియమితుడైన వ్యక్తికి ఈ మాల్ ప్రాక్టీసు గురించి ముందే తెలుసని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనతో పాటు ఇన్విజిలేటర్లపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించి నివేదికను అందజేయాలని జునగఢ్ జిల్లా విద్యాశాఖాధికారిని విద్యాశాఖ ఆదేశించింది.