Jayalalitha Death Mystery: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళ ప్రజల అమ్మ జయలలిత మరణంపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరణం కంటే ముందే అస్వస్థత ఉన్నప్పుడు ఎందుకు నిర్లక్ష్యం జరిగిందనేది కొత్త అనుమానం..
తమిళనాట ఆరాధ్యదైవంగా వెలిగిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అనారోగ్యంతో మరణించడం వెనుక ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలెన్నో ఉన్నాయి. ఆమె మృతికి సంబంధించి ఏదో తెలియని రహస్యముందనేది ఆమెను అమితంగా అభిమానించేవారు చెప్పే మాట. నిరంతరం ఆమెకు వెన్నంటి ఉండే శశికళపై కూడా అప్పట్లో అనుమానాలు వెల్లువెత్తాయి. జయలలిత మృతిపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేయడంతో నాటి ముఖ్యమంత్రి పళనిస్వామి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామితో కమిటీ ఏర్పాటు చేశారు.
దాదాపు 75 రోజులపాటు చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన జయలలిత డిసెంబర్ 5, 2016లో కన్నుమూశారు. సెప్టెంబర్ 22 న ఆసుపత్రిలో చేరిన అమ్మ..మళ్లీ తిరిగి రాలేదు. కొద్దికాలం విచారణ సాగిన తరువాత ఆగిపోయింది. తిరిగి రెండేళ్ల తరువాత ప్రారంభమైంది. విచారణ కమిటీ ముందు అపోలో ఆసుపత్రికి చెందిన ఐదుగురు వైద్యులు హాజరై..వాంగ్మూలమిచ్చారు. ఈ విచారణలోనే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. జస్టిస్ ఆర్ముగస్వామి కమీషన్ ముందు హాజరైన అపోలో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ బాబు మోహన్ కీలక విషయాలు వెల్లడించారు.
అపోలో వైద్యుడు డాక్టర్ బాబు మోహన్ చెప్పిన విషయాలు
" 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో రెండవసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టక ముందు నుంచే జయలలిత తీవ్ర అస్వస్థతతో ఉండేవారు. అప్పటికే ఆమె మరొకరి సహాయం లేకుండా నడవలేకపోయేవారు.తరచూ స్పృహ కోల్పోతుండేవారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించినా..ఆమె వినలేదు.రోజుకు 16 గంటలు పనిచేసే తాను విశ్రాంతి తీసుకోలేనని బదులిచ్చారు. జయలలిత వ్యక్తిగత వైద్యుడైన డాక్టర్ శివకుమార్ ఆదేశాలతో నేను పోయెస్ గార్డెన్‌కు వెళ్లినప్పుడు కనీసం ఒంటరిగా నడిచే స్థితిలో కూడా లేరు."
ఎవరు నిర్లక్ష్యం వహించారు
ఇప్పుడు డాక్టర్ బాబు మోహన్ వెల్లడించిన అంశాలే మరిన్ని అనుమానాలకు దారి తీస్తున్నాయి. జయలలిత ఆరోగ్యం అంతగా బాగాలేనప్పుడు ఎందుకు నిర్లక్ష్యం జరిగింది, ఎవరు కారణమనేది చర్చకు దారి తీస్తుంది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రంలో బలమైన మహిళ తీవ్ర అనారోగ్యంతో ఉంటే..ఎవరూ ఎందుకు పట్టించుకోలేదనేది అసలు ప్రశ్న. నిరంతరం ఆమె వెన్నంటి ఉండే శశికళ ఆ సమయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదనేది మరో ప్రశ్న. అపోలో వైద్యుడు పరిశీలించిన తరువాత వైద్యం అవసరమనే విషయాన్ని కచ్చితంగా చెప్పే ఉండవచ్చు. మరి ప్రభుత్వ అధికారులు కానీ మరొకరు కానీ ఎందుకు నిర్లక్ష్యం వహించారు. ఆ నిర్లక్ష్యం వెనుక ఏవైనా శక్తులు పనిచేశాయా అనేది సందేహంగా మారింది. ఇలా జయలలిత మరణం విషయంలో ఇప్పటికీ అన్నీ సమాధానం లేని ప్రశ్నలే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook