Aditya L1 Mission: సూర్యుడిపై ఇస్రో కన్ను.. ఆదిత్య L1 రాకెట్‌ ప్రయోగానికి సిద్ధం

ISRO Ready to Launch First Solar Mission Aditya L1: ఇస్రో మరో భారీ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. చంద్రుని దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 విజయవంతంగా అడుగుపెట్టిన నేపథ్యంలో.. సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య L1 శాటిలైట్‌ను రెడీ చేసింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 23, 2023, 07:29 PM IST
Aditya L1 Mission: సూర్యుడిపై ఇస్రో కన్ను.. ఆదిత్య L1 రాకెట్‌ ప్రయోగానికి సిద్ధం

ISRO Ready to Launch First Solar Mission Aditya L1: జాబిల్లిపై రహాస్యాలను ఛేదించేందుకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) పంపించిన చంద్రయాన్-3 సక్సెస్ అయింది. ఇదే ఉత్సాహంతో మరో భారీ ప్రయోగానికి ఇస్రో రెడీ అవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 6 ప్రయోగాలు విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో.. అదే జోష్‌లో మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. తొలిసారి సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు రాకెట్‌ను పంపించనుంది. ఆదిత్య L1 రాకెట్‌ను మరో రెండు నెలల్లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేయనుంది. సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్ ఇదే కానుండడం విశేషం. అంతరిక్ష నౌక భూమి నుంచి 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థ లగారెంజ్ పాయింట్ 1 చుట్టూ ఒక కక్ష్యలో ఆదిత్య L1ను ప్రవేశపెట్టనుంది ఇస్రో.

సూర్యుడు, అక్కడి పర్యావరణం, సౌర మంటలు, సౌర తుఫానులు, కరోనల్‌లను అధ్యయనం చేసే అంతరిక్ష నౌకను ప్రయోగించాలని యోచిస్తోంది. ఆదిత్య L1 మిషన్ దాదాపు 5 సంవత్సరాల పాటు సూర్యునిపై అధ్యయనం చేసే భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్ అవుతుంది. ISRO నివేదిక ప్రకారం.. అంతరిక్ష నౌకలో సూర్యుని వివిధ కోణాల్లో అధ్యయనం చేయడానికి ఏడు శాస్త్రీయ పేలోడ్‌లు ఉంటాయి. వ్యోమనౌక భూమి-సూర్య వ్యవస్థ లాగ్రాంజ్ పాయింట్ L1లో తక్కువ భూమి కక్ష్యలో (LEO) ఉంచనున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా సూర్యుడిపై అధ్యయనం చేయడానికి ఈ స్థానం సరైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆదిత్య L1 ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో తయారు చేశారు. అక్కడి నుంచి రీసెంట్‌గా షార్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. బెంగళూరులోనే వివిధ పరీక్షలు నిర్వహించి.. భారీ సీఆర్‌పీఎఫ్ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో షార్‌కు తీసుకువచ్చారు. సెప్టెంబరు మొదటి వారంలో పీఎస్‌ఎల్‌వీ-సీ57 ద్వారా ఆదిత్య L1ను ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. 

ఆదిత్య L1 లక్ష్యాలు..

==> ఇస్రో ప్రకారం.. క్రోమోస్పిరిక్, కరోనల్ హీటింగ్, పాక్షికంగా అయనీకరణం అయిన ప్లాస్మాభౌతిక శాస్త్రం, కరోనల్ మాస్ ఎజెక్షన్‌ల నిర్మాణం, మంటలను అర్థం చేసుకునేందుకు ఆదిత్య L1  మిషన్‌ను చేపట్టనున్నారు.
==> సౌర కరోనా, దాని వేడి చేసే విధానం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని కనుగొనడం. 
==> సూర్యుని బయటి పొర ఉష్ణోగ్రత, వేగం, సాంద్రతను లెక్కించడం.
==> సూర్యుని వివిధ పొరలను అధ్యయనం
==> సౌర కరోనా అయస్కాంత క్షేత్ర కొలతలను సేకరించడానికి..
==> సౌర గాలి, అంతరిక్ష వాతావరణం నిర్మాణం, కూర్పును అధ్యయనం చేయడానికి..
==> సూర్యుని గురించి, సూర్యుని కార్యకలాపాల వల్ల ప్రభావితమయ్యే సౌర వాతావరణం గురించి మరిన్ని వివరాలను అందిస్తుంది.

Trending News