పార్లమెంట్‌లో తొలి ప్రసంగంలోనే కాంగ్రెస్‌కి కౌంటర్ ఇచ్చిన అమిత్ షా

అడుక్కోవడం కన్నా.. పకోడీలు అమ్ముకోవడం ఉత్తమం : అమిత్ షా

Updated: Feb 6, 2018, 05:03 PM IST
పార్లమెంట్‌లో తొలి ప్రసంగంలోనే కాంగ్రెస్‌కి కౌంటర్ ఇచ్చిన అమిత్ షా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, గతేడాదే రాజ్యసభకు ఎంపికైన అమిత్ షా నేడు సభలో తొలిసారి ప్రసంగించారు. రాజ్యసభలో తాను చేసిన తొలి ప్రసంగంలోనే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి ఆయన ధీటైన కౌంటర్ ఇచ్చారు. ఒకానొక సందర్భంలో ఉపాధి కల్పన విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ.. "పకోడీలు అమ్ముకునే వాళ్లు కూడా స్వయం ఉపాధి పొందుతున్న వారి పరిధిలోకి వస్తారు" అని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండటాన్ని అమిత్ షా తన ప్రసంగం ద్వారా గట్టిగా తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. ''ఏ ఉపాధి లేకుండా అడుక్కోవడం కన్నా, పకోడీలు చేసి అమ్ముకోవడం చాలా ఉత్తమం'' అని కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారాయన.

 

ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపడుతూ.. ''కాంగ్రెస్ నేత పి చిదంబరం చేసిన ట్వీట్‌ని నేను కూడా చదివాను. ఆ ట్వీట్ చూసే చాలా సిగ్గేసింది. పకోడీలు అమ్ముకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు కానీ పకోడీలు అమ్ముకోవడాన్ని అడుక్కోవడంతో పోల్చడమే చాలా సిగ్గుచేటు'' అని అమిత్ షా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను తిప్పికొట్టారు .