న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఆదివారంనాడు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో నిర్వహించనున్నట్టు బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టంచేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి అరుణ్ జైట్లీ పార్థివదేహంను కైలాష్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించడానికి ముందుగా జేపి నడ్డా మీడియాతో మాట్లాడారు. ఆదివారం ఉదయం 10 గంటల వరకు అరుణ్ జైట్లీ పార్థివదేహాన్ని ఆయన నివాసంలోనే ఉంచుతామని.. ఆ తర్వాత ఆయన పార్థివదేహాన్ని ప్రజా సందర్శనార్థం బీజేపీ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లనున్నట్టు చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం బీజేపి ప్రధాన కార్యాలయం నుంచి నిగంబోధ్ ఘాట్ వరకు అంతిమ యాత్రగా తీసుకువెళ్లి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు జేపి నడ్డా మీడియాకు తెలిపారు.
ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ గురించి మాట్లాడుతూ.. జైట్లీ మృతి దేశానికి తీరని లోటు అని జేపి నడ్డా అన్నారు. జైట్లీ మృతితో యావత్ దేశం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎప్పుడూ ఎంతో హుందాగా, చిరునవ్వులు చిందిస్తూ ఉండే అరుణ్ జైట్లీ ఇక లేరనే వాస్తవాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని.. క్లిష్ట సమయాల్లో ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన వారిలో జైట్లీ ఒకరని, అటు పార్టీకి, ఇటు దేశానికి పూర్తి చిత్తశుద్ధితో ఆయన సేవలు అందించారని జైట్లీ సేవలను జేపి నడ్డా కొనియాడారు.