వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమం.. ప్రధాని మోదీ పరామర్శ

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) ఆరోగ్యం మరింత క్షీణించింది.

Last Updated : Aug 16, 2018, 11:38 AM IST
వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమం.. ప్రధాని మోదీ పరామర్శ

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) ఆరోగ్యం మరింత క్షీణించింది. గత 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమించిందని ఢీల్లీలోని ఎయిమ్స్‌ వర్గాలు బుధవారం రాత్రి వెల్లడించాయి. ప్రస్తుతం ఆయనకు లైఫ్ సపోర్ట్ నడుస్తుందని.. ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్య సమాచారం తెలుసుకున్న వెంటనే ఆయన్ను పరామర్శించడానికి ప్రధాని నరేంద్రమోదీ రాత్రి ఎయిమ్స్‌కు వెళ్లారు. వైద్యుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. అలాగే చికిత్స పొందుతున్న బీజేపీ అగ్రనేత వాజ్ పేయిని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేతలు, పలువురు కేంద్ర మంత్రులు పరామర్శించారు. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఎయిమ్స్ వద్దకు చేరుకున్నారు.

కాగా, గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి..జూన్‌ 11వ తేదీన ఎయిమ్స్‌లో చేరారు. మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాల/ మూత్ర నాళాల సంబంధిత సమస్యలతో పాటు డెమెన్షియాతో ఆయన బాధ పడుతున్నారు.

ఇలా ఉండగా వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉండటంతో బీజేపీ నేటి అధికారిక కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసిందని తెలిసింది. ఏపీలో బీజేపీ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం రద్దైనట్లు సమాచారం.

అయితే, మరికొద్ది సేపట్లో వాజ్‌పేయి హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేయనున్నట్టు ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు.

ఉపరాష్ట్రపతి పరామర్శ

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్ పేయిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. గురువారం ఎయిమ్స్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య వాజ్‌పేయిని పరామర్శించారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Trending News