100 సైబర్ నేరాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఈ బీకాం గ్రాడ్యూయేట్.. వీడి స్టైలే వేరు!

Last Updated : Aug 31, 2018, 11:59 AM IST
100 సైబర్ నేరాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఈ బీకాం గ్రాడ్యూయేట్.. వీడి స్టైలే వేరు!

దాదాపు 100 వరకు సైబర్ నేరాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పోలీసు రికార్డులకెక్కిన ఓ సైబర్ నేరగాడిని గురుగ్రామ్ సైబర్ విభాగం పోలీసులు నిన్న చాకచక్యంగా వలేసి పట్టుకున్నారు. చాలామంది నేరగాళ్ల తరహాలో తాము టార్గెట్ చేస్తున్న వ్యక్తులకు ఫోన్ కాల్స్ చేయకుండానే పని కానివ్వడం ఈ క్రిమినల్ ప్రత్యేకత కావడంతో ఇంతకాలం వీడి ఆచూకీని పట్టుకోవడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. తాను లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తుల ఈమెయిల్స్ హ్యాక్ చేసి, వారి మెయిల్స్‌కి రావాల్సిన డెబిట్ / క్రెడిట్ కార్డుల వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ)లను తాను చౌర్యం చేసి, తనకు కావాల్సిన మొత్తాన్ని సైలెంట్‌గా దోచుకోవడం ఈ సైబర్ నేరగాడి ప్రత్యేకత. ఢిల్లీలోని తిలక్ నగర్‌లో నివాసం ఉండే సైబర్ క్రిమినల్ వికాస్ ఝాను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని కోర్టు ఎదుట హాజరుపర్చగా.. కోర్టు వికాస్ ఝాకు మూడు రోజుల పోలీసు కస్టడీ విధించింది.

రివార్డ్స్ పాయింట్స్‌తో ఎర: 
పోలీసుల అదుపులో ఉన్న ఈ సైబర్ క్రిమినల్.. తాను ఏ విధంగా నేరాలకు పాల్పడ్డాడనే వైనాన్ని వారికి పూస గుచ్చినట్టు వివరించాడు. తాను లక్ష్యంగా ఎంచుకున్న వారికి ఫోన్ చేయకుండానే వారికి మీ డెబిట్ / క్రిడెట్ కార్డుపై రివార్డ్ పాయింట్స్ వచ్చాయని, అవి పొందాలంటే ఈ ఫామ్ ని నింపాల్సిందిగా కోరుతూ ముందుగా వారికి ఓ లింక్‌తో కూడిన టెక్ట్స్ మెస్సేజ్ పంపించడంతో వికాస్ ఝా తన పని మొదలు పెడతాడు. అలా పంపించిన ఆ లింకులోనే వారికి తెలియకుండానే వారంతట వారే స్వయంగా తమ డెబిట్  లేదా క్రిడెట్ కార్డుల వివరాలను పొందుపర్చే విధంగా ఫామ్‌ని రూపొందిస్తాడు. తాము సైబర్ క్రైమ్ ఉచ్చులో పడుతున్నామని తెలియని బాధితులు ఆ లింకులో ఉన్న ఫారాన్ని నింపిన వెంటనే ఆ వివరాలను తస్కరించి... ఏంచక్కా తన పని కానివ్వడం వికాస్ ఝాకు వెన్నతో పెట్టిన విద్య. 

వికాస్ ఝా అరెస్ట్‌తో ఇక ఎన్నో కేసులను మూసేయొచ్చని గురుగ్రామ్ పోలీసులు స్పష్టంచేశారు. కేవలం గురుగ్రామ్ పరిధిలోనే వికాస్‌పై 20కిపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో వికాస్ అధికంగా నేరాలకు పాల్పడ్డాడని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. 

అందుకే ఇలాంటి సైబర్ నేరగాళ్లతో జర తస్మాత్ జాగ్రత్త!! మీకు రివార్డ్ పాయింట్స్ వచ్చాయని ఏమైనా మెస్సేజెస్, మెయిల్స్ వస్తే, దాని పూర్తి వివరాలు ఆరాతీయకుండా వెంటనే తొందరపడి మీ వివరాలను మీ అంతట మీరే ఇచ్చి చిక్కుల్లో పడకండి! 
 

Trending News