శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తమ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకొనేది లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గతంలో కూడా గోవా, ఉత్తరప్రదేశ్‌తో పాటు గుజరాత్ ఎన్నికల్లో కూడా బీజేపీకి పోటీగా శివసేన తమ అభ్యర్థులను పోటీకి దించిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా సంజయ్ రౌత్ మాట్లాడుతూ "మా నాయకుడు ఉద్దవ్ థాక్రే ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సారి మేము కర్ణాటకలో స్వతంత్రంగా పోటీ చేయాలని నిశ్చయించుకున్నాం. కాకపోతే మరాఠీ ప్రాంత ప్రజలు ఉన్నట్టువంటి ప్రాంతాల్లో పోటీ చేస్తున్న మహారాష్ట్ర ఏకీకరణ సమితి పార్టీకి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నాం" అని సంజయ్ రౌత్ మీడియాకి తెలిపారు. థాక్రే గతంలో 2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా స్వతంత్రంగానే నిలబడతామని చెప్పిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం శివసేన మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా బీజేపీకి పార్టనరుగా ఉంది. అయితే గతకొంతకాలంగా కర్ణాటకలో ఉన్న బెల్గాం, కర్వార్‌తో పాటు మరాఠీల ప్రాబల్యం ఉన్న 800 గ్రామాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని శివసేనలోనే పలువురు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు.
కర్ణాటకలో వివాదాస్పదమైన ప్రాంతాల్లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ని సంచరించవద్దని రౌత్ హితవు పలికారు. గతంలో రౌత్, మరాఠీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని చెప్పినప్పుడు, ఆయనపై కన్నడ ప్రజలు పోలీసు కేసు నమోదు చేశారు. ఆయన మాటలు ప్రాంతీయతను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని తెలిపారు