లక్నో: ప్రచురించడానికి వీల్లేని విధమైన బూతులు తిట్టుకుంటూ ఒకరిపై మరొకరు ముష్టియుద్ధానికి దిగారు ఇద్దరు బీజేపీ నేతలు. ఆ ఇద్దరూ గల్లి నేతలేమో అని భావిస్తే, అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే వారిలో ఒకరు పార్లమెంట్‌లో చట్టాలు చేసే ఎంపీ కాగా మరొకరు రాష్ట్ర చట్ట సభలో సభ్యుడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా వున్నాయి. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించేందుకు జిల్లా సమన్వయ కమిటి సమావేశం కాగా.. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపి ఎంపీ శరద్ త్రిపాఠి ఓ రోడ్డు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలకంపై తన పేరు ఎందుకు లేదని ప్రశ్నించారు. అయితే, శిలా ఫలకంపై ఎవరెవరి పేర్లు రాయాలో తానే నిర్ణయించానని జిల్లాలోని ఎమ్మెల్యేల్లో ఒకరైన రాకేశ్ బఘేల్ తెలిపారు. దీంతో కోపోద్రిక్తుడైన ఎంపీ శరద్ త్రిపాఠి ఎమ్మెల్యేపై ఒంటి కాలితో లేస్తూ చిందులేశారు. తన కాలి బూటు తీసి ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు. ఊహించని పరిణామానికి షాకైన ఎమ్మెల్యే సైతం తాను కూర్చున్న కుర్చీలోంచి లేచి వెళ్లి మరి ఎంపీపై పిడిగుద్దులు కురిపించారు.
#WATCH Sant Kabir Nagar: BJP MP Sharad Tripathi and BJP MLA Rakesh Singh exchange blows after an argument broke out over placement of names on a foundation stone of a project pic.twitter.com/gP5RM8DgId
— ANI UP (@ANINewsUP) March 6, 2019
ఇద్దరూ బాహాబాహికి దిగి ఘర్షణ పడుతుండగా అక్కడే వున్న తోటి నేతలు, అధికారులు మధ్యలో కలగజేసుకుని వారిని శాంతింపచేసినట్టు తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు, తోటి ప్రజాప్రతినిధులు, విలేకరుల సమక్షంలో జరిగిన ఈ ఘటన కొంతమంది రాజకీయ నాయకుల వైఖరి ఇంతేనా అనే చర్చలకు తెరలేపింది.