పద్మావతి విరోధులకు ఖబడ్దార్ : శవంతో సందేశం

రాజస్థాన్ నహర్ గర్ కోటలో ఓ శవాన్ని ఎవరో వేలాడదీసి.. దగ్గరలోని గోడలపై పద్మావతి సినిమా గురించి పలు వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Nov 25, 2017, 11:23 AM IST
    • పద్మావతి విరోధులకు హెచ్చరిక అని సందేశం
    • చనిపోయిన వ్యక్తి ఎవరన్న అంశంపై పోలీసుల దర్యాప్తు
    • ఇంకా సెన్సార్ అవ్వని సినిమా
పద్మావతి విరోధులకు ఖబడ్దార్ : శవంతో సందేశం

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పద్మావతి" సినిమా మరోసారి వివాదంలో చిక్కుకుంది. రాజస్థాన్ నహర్ గర్ కోటలో ఓ శవాన్ని ఎవరో వేలాడదీసి.. దగ్గరలోని గోడలపై పద్మావతి సినిమా గురించి పలు వ్యాఖ్యలు చేశారు. "పద్మావతి విరోధుల్లారా.. మేము కట్టెలం తగలబెట్టం.. ఉరివేసి శవాలను తగలెడతాం" అని అర్థం వచ్చేలా ఆ గోడలపై స్లోగన్స్ రాశారు. అయితే ఈ విషయంపై ఇప్పుడే ఏమీ స్పందించలేమని జైపూర్ నార్త్ డీసీపీ సత్యేంద్ర సింగ్ తెలిపారు. ఈ శవం ఎవరిదో.. ఎందుకు కోటలో వేలాడదీశారో అనే అంశంపై దర్యాప్తు జరుపుతున్నామని, త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తామని ఆయన చెప్పారు.

ఓ నలభయ్యేళ్ల వ్యక్తి శవాన్ని కోటలో వేలాడదీసి, పద్మావతికు వ్యతిరేకంగా చిత్రాలు తీస్తున్నవారికి ఎవరో బలమైన సందేశం పంపారని ఇప్పటికే అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇదివరకు పద్మావతి సినిమాని ఆపేయాల్సిందని రాజ్‌పుత్ కర్ణి సేన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యాఘటనకు, తమకు ఎలాంటి సంబంధంలేదని ఇప్పటికే ఆ సంస్థ తెలియజేసింది.

బుధవారం రాజ్‌పుత్ కర్ణి సేన నిర్మాతలు ఎన్ని మార్పులు చేసినా, తాము చిత్ర విడుదలను అడ్డుకొనే తీరుతామని చెప్పిన క్రమంలో ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు అన్న కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డిసెంబరు 1వ తేదీన ఈ సినిమాని విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర నిర్మాతలు ప్రకటించిన నేపథ్యంలో రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా,  మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో రాజ్ పుత్ సంఘాల ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఆందోళనలను చేపడుతున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తే ఊరుకొనేది లేదని తెగేసి చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కోసం వేచి చూస్తోంది. అయితే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదల చేస్తున్నారని వార్తలు వస్తున్న క్రమంలో ..  చిత్ర పంపిణీదారుల్లో ఒకరైన వయాకమ్ 18ను సంప్రదించగా.. సినిమా సెన్సార్ అయేంత వరకు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలా వద్దా అన్న ఆలోచనలో తాము లేమని వారు చెప్పడం జరిగింది. 

Trending News