ఇకపై ఫేస్‌బుక్, ట్విటర్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుకింగ్!

మీరు మీ ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి సామాజిక వేదికల ద్వారా కూడా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.

Last Updated : Jan 9, 2018, 07:29 PM IST
ఇకపై ఫేస్‌బుక్, ట్విటర్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుకింగ్!

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందా ? అయితే ఇంతకుముందులా మొబైల్, ఎస్ఎంఎస్‌ విధానంలోనే సిలిండర్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి సామాజిక వేదికల ద్వారా కూడా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతానికి కేవలం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)లో ఖాతా కలిగిన వినియోగదారులకి మాత్రం ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ డిజిటలైజేషన్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియా వేదికల ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

ఫేస్‌బుక్, ట్విటర్ ద్వారా ఎలా బుక్ చేసుకోవచ్చు ?

> ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయిన అనంతరం ఐఓసీఎల్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ (@indianoilcorplimited) కి వెళ్లి, అక్కడ కనిపిస్తున్న బుక్ నౌ (Book Now) అనే ఆప్షన్‌ని ఎంచుకోవాలి. 

> ఇక ట్విటర్‌లో బుకింగ్ విషయానికొస్తే, ట్విటర్‌లోకి లాగిన్ అయిన అనంతరం refill @indanerefill అని ట్వీట్ చేయాల్సి వుంటుంది. అయితే, మొదటిసారిగా ట్విటర్ ద్వారా రిజిస్టేషన్ చేసుకునే క్రమంలో register LPGID అని ట్వీట్ చేయడం మర్చిపోకూడదు.

సామాజిక వేదికల వినియోగం విస్తృతంగా వున్న ప్రస్తుత తరుణంలో ఆయా వేదికల ద్వారా ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత వుందని గత నెలలో మార్కెటింగ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ సూచించినట్టు సంస్థ వర్గాలు తెలిపాయి. 

Trending News