త్రిపుర రాజధాని అగర్తలాలో ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలలో పన్నెండవ తరగతి చదువుతున్న దిలీప్ కుమార్ సాహా తన స్నేహితురాలితో రిలేషన్ షిప్లో ఉన్నాడని పలువురు విద్యార్థులు ఫిర్యాదు చేయడంలో ఉపాధ్యాయులు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ప్రిన్సిపల్కి విషయాన్ని తెలియజేసి.. ఆ ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులకూ సమన్లు జారీ చేశారు. వారి తల్లిదండ్రులు స్కూలుకి వచ్చాక.. వారి ఎదుటగానే సాహాని పిలిపించి తన స్నేహితురాలికి రాఖీ కట్టమని ఆదేశించారు.
అయితే సాహా గానీ, తన స్నేహితురాలు గానీ అందుకు అంగీకరించలేదు. దీంతో రాఖీ కట్టాల్సిందేనని సదరు విద్యార్థిని టీచర్లు బలవంతపెట్టారు. రాఖీ కట్టి ఆమెను తన సోదరిగా పరిగణించాలని తెలిపారు. ఉపాధ్యాయులు ఈ విధంగా బలవంతపెట్టడంతో.. సదరు విద్యార్థి పరుగెత్తుకుంటూ వెళ్లి పాఠశాల రెండో అంతస్తు మీద నుండి దూకేశాడు. ఊహించని ఈ ఘటనతో ఉపాధ్యాయులు షాక్ అయ్యారు. వెంటనే విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తీవ్రంగా గాయపడిన విద్యార్థి పరిస్థితి ఆందోళనగా ఉందని తెలిపారు వైద్యులు.
అయితే ఈ సంఘటన జరిగాక... పాఠశాలలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. విద్యార్థుల భావోద్వేగాలతో ఆడుకున్న సదరు ఉపాధ్యాయులపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అయితే అంతకు క్రితమే జరిగిన సంఘటనపై స్కూలు యాజమాన్యమే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.