ఇంగ్లీష్‌లో మాట్లాడినందుకు యువకుడిపై దాడి చేసి లాకప్‌లో వేసిన పోలీసులు

పోలీసులని ఇంగ్లీష్‌లో ప్రశ్నించడం తప్పా ? అదేమైనా క్షమించరాని నేరమా ? అందులు లాకప్‌లో వేస్తారా ?

Last Updated : Mar 31, 2018, 10:54 PM IST
ఇంగ్లీష్‌లో మాట్లాడినందుకు యువకుడిపై దాడి చేసి లాకప్‌లో వేసిన పోలీసులు

" వాట్ ఈజ్ ది రీజన్ బిహైండ్ హిజ్ డిటెన్షన్ " ? ఇలా ఇంగ్లీష్‌లో పోలీసులని ప్రశ్నించడమే ఆ కుర్రాడు చేసిన తప్పు. అంతమాత్రానికే శివాలెత్తిపోయిన పోలీసులు... మాకే ఎదురుచెబుతావా అంటూ ఆ కుర్రాడిపై తమ పోలీసు జులుం చూపించారు. కుర్రాడిపై దాడి చేసి ఏ నేరం చేయకుండానే అధికారం వుంది కదా అని అతడిని లాకప్‌లో పెట్టారు. ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ఆధారంగా  బీహార్‌లోని ఖగారియా జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఈ దారుణమైన ఘటన వివరాలు ఇలా వున్నాయి. బైక్ చోరీ కేసులో ఓ వ్యక్తిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్న చౌతాం పోలీసులు అతడిని కస్టడీకి తరలించారు. పోలీసుల కస్టడీలో వున్న తన అంకుల్‌ని విడిపించుకుని వెళ్లేందుకు 12వ తరగతి చదువుతున్న అభిషేక్... చౌతాం పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. ఆ బైక్ తన అంకుల్‌దే అని నిరూపించడానికి అవసరమైన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా పోలీసులకు చూపించాడు. అయినప్పటికీ పోలీసులు అభిషేక్ మాటలను పట్టించుకోలేదు.. ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని అభిషేక్... ''ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత కూడా ఇంకా అతడిని విడిచిపెట్టనప్పుడు అతడిని అదుపులోకి తీసుకోవడం వెనుకున్న కారణం'' ఏంటి అని నిలదీశాడు. 

తాను ఇంగ్లీష్‌లో ప్రశ్నించడంతో తను ఏం అడుగుతున్నానో కూడా అర్థం చేసుకోలేక, వాళ్లు వెంటనే తనపై దాడి చేయడం మొదలుపెట్టారని వాపోయాడు అభిషేక్. అంతేకాకుండా బైక్ చోరీ కేసులో తనని కూడా ఇరికించి మూడు రోజులపాటు లాకప్‌లో పెట్టారని అభిషేక్ ఆ జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. జిల్లా ఎస్పీ మీను కుమారి ఆదేశాల మేరకు విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగిన డీఎస్పీ రామానంద్ సాగర్.. పోలీసులు అకారణంగానే అత్యుత్సాహం ప్రదర్శించి ఆ కుర్రాడిపై దాడి చేశారని నిర్ధారణకు వచ్చారు. అందుకు బాథ్యులైన ఎస్సై ముఖేష్ కుమార్, ఏఎస్ఐ శ్యామ్ సుందర్ సింగ్‌లపై జిల్లా ఎస్పీకి నివేదిక అందించారు. డీఎస్పీ అందించిన నివేదిక ఆధారంగా ఆ ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. 

ఇంగ్లీష్‌లో మాట్లాడటాన్ని కానీ లేదా ఇంగ్లీష్‌లో రాయడాన్ని కానీ కష్టతరంగా భావిస్తున్న కొంతమంది పోలీసులు.. ఇంగ్లీష్‌లో మాట్లాడే వారిని, ఇంగ్లీష్‌లో ఫిర్యాదు రాసి ఇచ్చే వారిపై తరచుగా ఇలా నిరుత్సాపరిచే పనులకు పాల్పడుతున్నట్టుగా ఇప్పటికే బీహార్ పోలీసులపై అనేక ఆరోపణలు వున్నాయి. గతేడాది బీహార్‌లోని ముంగర్ జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్ హౌజ్ ఇంచార్జ్ విషయంలో జరిగిన ఘటనే అందుకు చక్కటి ఉదాహరణ. " తాను ఫలానా కేసుని దర్యాప్తు చేయలేనని, ఆ కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఇంగ్లీష్‌లో వుండటమే అందుకు కారణం" అని స్వయంగా కొత్వాల్ పోలీస్ స్టేషన్ హౌజ్ ఇంచార్జ్ నిర్మోహమాటంగా కోర్టుకు తెలపడం చూసి విస్తుపోవడం అప్పట్లో కోర్టు వంతయ్యింది. బీహార్ పోలీసు శాఖలో ఇంగ్లీష్ భాష రాని కొంతమంది అధికారుల తీరు కారణంగా ఆ రాష్ట్ర పోలీసుల పేరు అప్రతిష్టపాలవడం గమనార్హం. 

Trending News