కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో ఉద్యోగులకు అనుకున్నంత ఊరట లభించలేదనే చెప్పుకోవచ్చు. వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపులో ఎలాంటి మార్పులు ఉండవని ప్రకటించడంతో ఉద్యోగస్తుల ఆశలు అడియాసలే అయ్యాయి.
తన బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ మాట్లాడుతూ ఆదాయపు పన్నును ప్రజలు ఫైల్ చేయడం ద్వారా ప్రభుత్వానికి 90 వేల కోట్ల రాబడి అదనంగా వచ్చిందని తెలిపారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి కొత్తగా 5 లక్షలమంది చేరారని తెలిపారు. అలాగే పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య కూడా 40 శాతం పెరిగిందని ఆయన తెలిపారు. ఈ సంవత్సరంలో ఆదాయ పన్ను మినహాయిపు పరిమితిలో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ... ట్రాన్స్‌పోర్టు అలవెన్సు, మెడికల్ అలవెన్సులకు సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్‌ను వర్తింపజేస్తున్నట్లు తెలిపారు.
అలాగే ఆదాయపు పన్నుకి సంబంధించి సెస్‌ను 3 శాతం నుండి 4 శాతం వరకు పెంచడం వల్ల పన్ను స్వల్పంగా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆదాయపు పన్ను విషయంలో కేంద్రం జీతగాళ్ళకు ఏం చేయకపోయినా.. పీఎఫ్ విషయంలో కొంత వెసులుబాటు కల్పించింది. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి రాబోయే మూడు సంవత్సరాలకు గానూ ప్రభుత్వమే 12 శాతం ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ చెల్లిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు ఇన్నాళ్లూ మహిళా ఉద్యోగులు తమ జీతాల నుంచి చెల్లిస్తున్న 12శాతం పీఎఫ్‌ను 8 శాతానికి తగ్గిస్తున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు.