ఐసిఐసిఐ బ్యాంకు ఎండీ మరియు సీఈఓ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ పై సిబిఐ అధికారులు ప్రిలిమినరీ ఎంక్వయరీని రిజిస్టర్ చేశారు. అలాగే పలువురు వీడియోకాన్ కంపెనీ ప్రతినిధులపై కూడా ఎంక్వయరీ వేశారు. ఐసిఐసిఐ బ్యాంకు, వీడియోకాన్ కంపెనీకి రూ.3,250 కోట్ల రూపాయలను లోన్‌గా అందించిన క్రమంలో ఏవైనా అవకతవకలు జరిగాయా అన్న విషయంపై ఒక క్లారిటీని పొందేందుకు సిబిఐ అధికారులు ఈ ఎంక్వయరీ వేశారు.
ఈ క్రమంలో త్వరలోనే దీపక్ కొచ్చర్‌ను సిబిఐ ఆఫీసుకు తీసుకొచ్చి విచారిస్తామని అధికారులు తెలిపారు. ఇటీవలే వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ దూత్, దీపక్ కంపెనీకి చెందిన పలు కంపెనీలకు కోట్లాది రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారని వార్తలు వచ్చిన క్రమంలో ఈ ఎంక్వయరీ వేసినట్లు అధికారులు తెలిపారు
2012లో లోన్ తీసుకున్నా.. వీడియోకాన్ కంపెనీ ఆ తర్వాత అందులో 86 % మొత్తాన్ని చెల్లించలేకపోయింది. అందుకే ఆ రుణాన్ని స్థూల నిరర్థక ఆస్తిగా ప్రకటించడం జరిగింది. వీడియోకన్ సంస్థకు రుణాలు ఇచ్చిన బ్యాంకులలో ఐసిఐసిఐ బ్యాంకు మాత్రమే లేదు. ఇంకా చాలా బ్యాంకులు ఉన్నాయి. అవన్నీ కలసి వీడియోకాన్‌కి రూ.36 వేల కోట్ల రుణాన్ని అందించినట్లు తెలుస్తోంది.
అయితే బ్యాంకు నిబంధనలను తుంగలోకి తొక్కి.. ఐసిఐసిఐ కంపెనీకి లోన్ ఇచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలను ఐసిఐసిఐ బ్యాంకు ఖండించింది. ఈ క్రమంలో నిజనిజాలు తెలుసుకొనేందుకు సిబిఐ పలువురు వ్యక్తులపై ఎంక్వయరీ వేసింది. అందులో భాగంగా చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌ను విచారించనున్నట్లు తెలిపింది