న్యూఢిల్లీ: కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ కాని నివాసాల కొనుగోలు వ్యవహారాల్లో ప్రస్తుతం ప్రభుత్వం వసూలు చేస్తోన్న 12% వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని ఇంకొంతమేరకు తగ్గించాలనే డిమాండ్ నేపథ్యంలో ఫిబ్రవరి 20వ తేదీన సమావేశం కానున్న జీఎస్టీ కౌన్సిల్.. గృహ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ నేతృత్వంలో ఇప్పటికే పలువురు మంత్రుల బృందం జీఎస్టీ రేటు తగ్గింపు అంశం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు జీ మీడియాకు తెలిపాయి. ప్రస్తుతం అమలులో వున్న జీఎస్టీ రేటు కారణంగా రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై అధ్యయనం చేసేందుకు గత నెలలో మంత్రుల కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే.
నిర్మాణంలో వున్న గృహాలపై 5శాతం, సరసమైన ధరల్లో లభించే గృహాలపై 3 శాతం జీఎస్టీ విధించాల్సిందిగా ఈ కమిటీ సూచనలు చేసే అవకాశం వుందని గతంలోనే సంబంధిత వర్గాలు జీ మీడియాకు వెల్లడించాయి. అదేకానీ జరిగితే గృహకొనుగోలుదారులపై జీఎస్టీ రూపంలో కొంత భారం తగ్గే అవకాశాలున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
జీఎస్టీ అమలులోకి రాకముందు నిర్మాణంలో వున్న గృహాలపై 4.5 శాతం సేవల పన్నుతో పాటు 1-5శాతం వ్యాల్యూ యాడెడ్ టాక్స్ విధించే వారు. ఈ పన్నుల శాతం అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా కాకుండా వివిధ రాష్ట్రాల్లో వివిధ శాతం పన్నులు విధించేవారు.