ప్రిన్సిపల్‌ని తుపాకీతో కాల్చిన హర్యానా విద్యార్థి..!

ప్రిన్సిపల్‌ని తుపాకీతో కాల్చిన హర్యానా విద్యార్థి..!

Last Updated : Jan 21, 2018, 08:58 AM IST
ప్రిన్సిపల్‌ని తుపాకీతో కాల్చిన హర్యానా విద్యార్థి..!

గురుగ్రామ్‌లో ఓ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి, ఆఫీసు గదిలోకి జొరబడి తన స్కూలు ప్రిన్సిపల్‌‌నే తుపాకీతో కాల్చాడు. ఈ పని చేయడానికి తన తండ్రి వాడే లైసెన్స్ రివాల్వర్‌ సహాయం తీసుకున్నాడని సమాచారం. హర్యానా రాష్ట్రంలోని యమునా నగర్ ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ ప్రాంత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ కాలియా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. వివేకానంద స్కూలులో చదువుతున్న ఆ బాలుడు చదువులో బాగా వెనుకబడే విద్యార్థి అని.. పలుమార్లు ప్రిన్సిపల్ రితు చాబ్రా అతన్ని మందలించడంతో పగతో ఈ పని చేసుకుంటాడని కొందరు టీచర్లు చెప్పడం గమనార్హం. గతంలో అదే విద్యార్థిని పలుమార్లు సస్పెండ్ చేసినట్లు కూడా సమాచారం.

ఆ విద్యార్థి, ప్రిన్సిపల్ పై తూటాలు సంధించే సమయంలో ఆఫీసులో పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ జరుగుతోంది. స్కూలులో కాల్పుల శబ్దం వినిపించగానే.. సెక్యూరిటీ సిబ్బంది చాకచక్యంతో వ్యవహరించి పారిపోబోతున్న విద్యార్థిని పట్టుకున్నారు. ఆ తర్వాత ప్రిన్సిపల్‌ని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మధ్యకాలంలో హర్యానా, యూపీ ప్రాంతాల్లో విద్యార్థులు ఇలాంటి హత్యయత్నాలకు పాల్పడడం సాధారణమైపోయింది. సెప్టెంబరులో గురుగ్రామ్ ప్రాంతంలో 16 ఏళ్ళ ఓ విద్యార్థి, తన స్కూలులో చదువుతున్న రెండవ తరగతి విద్యార్థిని ఒక ప్రణాళిక ప్రకారం మట్టుబెట్టాడు. అలాగే ఇదే నెల లక్నోలో ఓ విద్యార్థిని, ఒకటవ చదువుతున్న చిన్నకుర్రాడిపై కత్తితో దాడి చేసింది. 

Trending News