న్యూ ఢిల్లీ : ఢిల్లీలో అల్లర్లు, హింస వెనుక బీజేపి, ఆమ్ ఆద్మీ పార్టీ హస్తం ఉన్నాయని కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. బీజేపి, ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలిపిందని.. లేదంటే ఈ అల్లర్లకు ప్రధాన కారకులైన తాహీర్ హుస్సేన్, కపిల్ మిశ్రాలపై ఢిల్లీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని కర్ణాటక కాంగ్రెస్ నిలదీసింది. ఈమేరకు కర్ణాటక కాంగ్రెస్ ఓ ట్వీట్ చేసింది. ఆప్ నేత తాహిర్ హుస్సేన్, బీజేపి నేత కపిల్ మిశ్రాలే ఢిల్లీలో హింసకు బాధ్యులుగా ఆ పార్టీ తమ ఆరోపణల్లో పేర్కొంది. ఢిల్లీ పోలీసులు 123 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినప్పటికీ.. రెచ్చగొట్టేలా విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపి నేతలు ఎవ్వరూ ఆ జాబితాలో ఎందుకు లేరని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. ఢిల్లీ అల్లర్ల కారణంగా 42 మంది చనిపోయి 200 మంది వరకు గాయపడిన ఈ ఘటనలో ఢిల్లీ పోలీసులు ఎవరికి మద్దతిస్తున్నారని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసిన కాంగ్రెస్.. ఢిల్లీ పోలీసుల వైఖరి పక్షపాతం అనిపించుకోదా అని మండిపడింది.
అమిత్ షా, అజిత్ దోవల్ తక్షణమే రాజీనామా చేయాలి..
కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న కేసులో నిందితుడిగా ఉన్న జైషే ఉగ్రవాది యూసుఫ్ చొపన్కి బెయిల్ ఎలా మంజూరు చేశారని కర్ణాటక కాంగ్రెస్ ప్రశ్నించింది. జైషే ఉగ్రవాది నేరాన్ని నిరూపించడంలో కేంద్రం విఫలమైందని... అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా దళం అధిపతి అజిత్ దోవల్ (NIA chief Ajit Doval ) తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..