క్రేజీగా జనం.. నామినేషన్ వేయలేకపోయిన కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. రోడ్ షోకు భారీగా జనాలు రావడంతో నిర్ణీత సమయానికి కేజ్రీవాల్ కమిషనర్ కార్యాలయానికి చేరుకోలేకపోయారు.

Last Updated : Jan 20, 2020, 06:46 PM IST
క్రేజీగా జనం.. నామినేషన్ వేయలేకపోయిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు. షెడ్యూల్ ప్రకారం కేజ్రీవాల్ సోమవారం నాడు న్యూఢిల్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే నామినేషన్ సందర్భంగా తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకుని రోడ్ షో ద్వారా బయలుదేరిన కేజ్రీవాల్‌ నిర్ణీత సమయానికి నామినేషన్ దాఖలు చేయాల్సిన ఆఫీసుకు చేరుకోలేకపోయారు. దీంతో నామినేషన్‌ను రేపటికి వాయిదా వేసుకున్నారు. వాల్మీకి ఆలయం మీదుగా జామ్ నగర్ హౌస్ వరకు రోడ్ షో నిర్వహించి నామినేషన్ వేయాలనుకున్నారు కేజ్రీవాల్.

ఢిల్లీ సీఎం నామినేషన్ రోడ్ షోకు ఆప్ మద్దతుదారులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రావడంతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. అనుకున్న సమయానికి చేరుకోలేకపోవడంతో సోమవారం నామినేషన్ దాఖలు చేయడం కుదరలేదు. మరోవైపు ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ కేజ్రీవాల్‌ను కట్టిపడేసింది. మధ్యాహ్నం 3 గంటలవరకు నామినేషన్ వేసే ఆఫీసుకు వెళ్లడం కుదరని పక్షంలో తాను మంగళవారం నామినేషన్ వేస్తానన్నారు. తన ప్రచార కార్యక్రమాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ కొనసాగించారు.

Also Read: 10 హామీలతో కార్డు విడుదల చేసిన అరవింద్ కేజ్రీవాల్

అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘నామినేషన్ విషయం తెలిసి భారీ సంఖ్యలో మద్దతుదారులు రోడ్ షోలో పాల్గొన్నారు. వారిని వదిలి నామినేషన్‌కు వెళ్లడానికి వీలుకాలేదు. వీరిని ఇలా వదిలి వెళ్లలేకపోయాను. ఆప్ చేసిన అభివృద్ధి మరోసారి అధికారాన్ని అందిస్తుందని’ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం నాడు 10 హామీలతో కూడిన గ్యారంటీ కార్డును కేజ్రీవాల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు చేపడతారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు గానూ రికార్డుస్థాయిలో 67 స్థానాల్లో ఆప్ విజయదుందుభి మోగించింది. బీజేపీ 3 స్థానాలకే పరిమితం కాగా, కాంగ్రెస్ ఖాతా కూడా తెరకలేకపోయింది. మరోసారి తమదే అధికారమని ఆప్ నేతలు ధీమాగా ఉన్నారు.  Also Read: 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ

  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News