న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై శుక్రవారం దుండగులు దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడిలో ముఖ్యమంత్రికి ఎటువంటి హాని జరగలేదని ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలు తెలిపాయి. ఉత్తర ఢిల్లీలోని నరేలాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 100 మంది పురుషులు కర్రలతో కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన దుండగులు.. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలు సైతం ద్వంసం చేసేందుకు యత్నించారని తెలుస్తోంది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి జరగడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది నవంబర్‌లో ఓ వ్యక్తి ఢిల్లీ సచివాలయం వద్ద కారం పొడి చల్లి దాడికి పాల్పడ్డారు. గతంలోనూ సిరా, చప్పులతో కేజ్రీవాల్‌పై దాడికి పాల్పడిన సందర్భాలున్నాయి. అంతేకాకుండా 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ ఢిల్లీలోని దక్షిణ్‌పురి ప్రాంతంలో కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహిస్తుండగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ఆయన చెంప ఛెళ్లుమనిపించిన వైనం అప్పట్లో సంచలనం సృష్టించింది.