భారత్ పురోగమిస్తోంది.. మీ కలలను నెరవేరుస్తోంది: ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన యూఏఈ పర్యటనలో భాగంగా ఆదివారం దుబాయ్‌లోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.

Last Updated : Feb 11, 2018, 04:42 PM IST
భారత్ పురోగమిస్తోంది.. మీ కలలను నెరవేరుస్తోంది: ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన యూఏఈ పర్యటనలో భాగంగా ఆదివారం దుబాయ్‌లోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. "మీరు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీకో విషయం తెలుసా.. భారత్ రోజు రోజుకీ పురోగమనం దిశగా పయనిస్తోంది" అని అన్నారు. దుబాయ్ ఓపెరాలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లో ఒకప్పుడు ప్రజలు తమ సమస్యలు తీరుతాయా లేదా అన్న మీమాంసలో ఉండేవారని.. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదన్నారు. తన ఉద్దేశంలో నిర్ణయాలు వెనువెంటనే తీసుకుంటే.. సమస్యలు కూడా వెనువెంటనే తీరుతాయని మోదీ అభిప్రాయపడ్డారు. భారత్ ఎంత పురోగమిస్తుందో.. మిగతా దేశాలతో ఎలా పోటీ పడుతుందో అన్న విషయాన్ని  ప్రపంచ బ్యాంకు సర్వేలను చూసి తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.

ఈ సమావేశంలో మోదీ నోట్ల రద్దు అంశం గురించి కూడా ప్రస్తావించారు. ప్రతిపక్షాలు నోట్ల రద్దు అంశం గురించి తనను ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటాయని.. కాకపోతే పేద ప్రజలు మాత్రం తనను బాగా అర్థం చేసుకున్నారని మోదీ తెలిపారు. తమ ప్రభుత్వం పాత నోట్లను రద్దు చేశాక.. బ్లాక్ మనీ సంపాదనపరులంతా వీధిన పడ్డారని.. ఇప్పుడు వారే తనను విమర్శిస్తున్నారు తప్పితే.. ప్రజలు మాత్రం తనను ఎప్పుడూ అర్థం చేసుకున్నారని మోదీ తెలిపారు.

అలాగే జీఎస్‌టీ విషయంలో కూడా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మోదీ తెలిపారు. సాధారణంగా ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు.. తొలుత కొంత ఇబ్బందులు ఉంటాయని.. కాకపోతే ఇవే విధానాల వల్ల భవిష్యత్తులో ప్రజలకు చాలా మేలు జరుగుతుందని మోదీ తెలిపారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ దుబాయ్‌లో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత.. అబుదబిలో తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హిందూ దేవాలయ శంఖుస్థాపన వేదికను కూడా దర్శించారు. భారతీయ శిల్పకారులతో పాటు దుబాయ్ ఇంజనీర్లు కూడా ఈ దేవాలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారని.. సర్వమత ఐక్యతను చాటేందుకు ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నారని.. 2020 కల్లా ఈ దేవాలయ నిర్మాణం పూర్తి అవుతుందని మోదీ తెలిపారు. అలాగే కుల,మత భేదాలకు అతీతంగా అందరూ వచ్చి ఈ దేవాలయంలో ప్రార్థనలు చేసుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

Trending News