అన్నాడీఎంకే వెన్నెముక లేని పార్టీ.. అందుకే అవిశ్వాస తీర్మానానికి సపోర్టు చేయలేదు: ఎంకే స్టాలిన్

తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఒక వెన్నెముక లేని పార్టీ అని.. అందుకే కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సహకారం అందించలేదని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తెలిపారు. బీజేపీ కనుసన్నల్లో నడిచే తొత్తుగా అన్నాడీఎంకే వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

Last Updated : Jul 21, 2018, 06:45 PM IST
అన్నాడీఎంకే వెన్నెముక లేని పార్టీ.. అందుకే అవిశ్వాస తీర్మానానికి సపోర్టు చేయలేదు: ఎంకే స్టాలిన్

తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఒక వెన్నెముక లేని పార్టీ అని.. అందుకే కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సహకారం అందించలేదని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తెలిపారు. బీజేపీ కనుసన్నల్లో నడిచే తొత్తుగా అన్నాడీఎంకే వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. వారి మధ్య రహస్య ఒప్పందాలు కూడా జరుగుతున్నాయని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం తమిళనాడుకి చేసిన మేలు ఏమీ లేదని.. నీట్ విషయంలో గానీ... జీఎస్టీ విషయంలో గానీ తమిళనాడు అభిప్రాయాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని.. అలాంటి పార్టీతో స్వలాభం కోసం అన్నాడీఎంకే బంధాన్ని కొనసాగిస్తోందని స్టాలిన్ తెలిపారు.

ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి, ప్రాంతీయతకు ఇచ్చే గౌరవానికి బీజేపీ ఎప్పుడూ కట్టుబడి లేదని.. అలాంటి పార్టీకి సహకారాన్ని ఇస్తున్న తమిళనాడు సీఎం పళనీస్వామి, అన్నాడీఎంకే ఎంపీలు వెన్నెముక లేనివారని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ఇటీవలే అమిత్ షా తమిళనాడులో పెచ్చుమీరుతున్న అవినీతి కేసుల గురించి మాట్లాడారని.. ఆ కేసుల నుండి తప్పించుకోవడం కోసం పళనీస్వామి బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని స్టాలిన్ అన్నారు. 

అవిశ్వాస తీర్మానాన్ని తెలుగుదేశం ప్రవేశపెట్టాలని భావించి.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామిని మద్దతు కోరినప్పుడు ఆయన వ్యతిరేకించారు. కావేరీ వివాదం చెలరేగినప్పుడు టీడీపీ ఏమీ మాట్లాడలేదని.. తాము కూడా వారి అంతర్గత విషయమైన ఏపీ ప్రత్యేక హోదా విషయంలో జోక్యం చేసుకోమని ఆయన తెలిపారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా మద్దతు ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు. 

Trending News