యాంటిసిపేటరీ బెయిల్ కావాలని ముగ్గురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై జార్ఖండ్ హైకోర్టు స్పందిస్తూ.. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమివ్వాలని, అలా చేస్తేనే బెయిలిస్తామని తెలిపింది.
ఇటీవలే సంభవించిన వరదలు కేరళకు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. కేరళలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి సమయం పట్టవచ్చు. వరదల కారణంగా నష్టపోయిన కేరళను దాతలు విరాళాలిచ్చి ఆదుకోవాలని కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థించారు. ఈ క్రమంలోనే కేరళను ఆదుకోవాలనే మానవతా దృక్పథంతో జస్టిస్ ఎబి సింగ్ ధర్మాసనం పైవిధంగా స్పందించింది.
ఛీటింగ్ మరియు ఫోర్జరీ కేసులో ఉత్పల్ రాయ్ అనే వ్యక్తి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ.7వేలు డిపాజిట్ చేస్తారన్న షరతుపై జస్టిస్ సింగ్ ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఛీటింగ్ కేసులో ధనేశ్వర్ మరియు శంభు అనే వ్యక్తులు రూ.5 వేలు సీఎం రిలీఫ్ ఫండ్‌కి పంపిస్తామని ఒప్పుకున్నాక న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చాక.. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
జార్ఖండ్ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హేమంత్ కుమార్ సికర్వర్ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్, కర్నాటకలో అధిక సంఖ్యలో కోర్టులు కేరళ సీఎం సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని ఇలాంటి ఆదేశాలను జారీ చేశారన్నారు.