న్యూఢిల్లీ: ఎల్పీజీ (LPG) సిలిండర్ల ధరలు భారీగా పెరిగిన తరువాత దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ దేశీయ గ్యాస్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగించింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసింది. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గురువారం (ఫిబ్రవరి 13న) ఈ ప్రకటన విడుదల చేసింది. అలాగే, గ్యాస్ ధరలు పెంచడానికి గల కారణాలను ప్రకటనలో ఆ శాఖ వివరించింది.
ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌పై ఇప్పటివరకు రూ .153.86 సబ్సిడీ లభిస్తుండగా, దీనిని రూ.291.48కి పెంచామని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. అదేవిధంగా, ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద పంపిణీ చేసిన కనెక్షన్‌పై ఇప్పటివరకు ఒక్క సిలిండర్‌కు రూ.174.86 మేర ఇచ్చేవారు. తాజాగా దీనిని రూ.312.48కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఇటీవల సబ్సిడీ లేని 14.2 కేజీల దేశీయ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధర కిలోల ధరను కేంద్రం రూ .144.50 పెంచిన విషయం తెలిసిందే. దీంతో సబ్సిడీ లేని డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.714 నుంచి రూ.858.50కు చేరుకుంది.
ధరలు ఎందుకు పెరిగాయంటే
జనవరి 2020లో అంతర్జాతీయంగా ఎల్పీజీ టన్ను ధర 448 డాలర్ల నుండి 567 డాలర్లకు గణనీయంగా పెరగడం వల్ల దేశీయ గ్యాస్ ధరలు పెరిగాయని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది.
26 కోట్లకు పైగా వినియోగదారులకు సబ్సిడీ
27.76 కోట్లకు పైగా ఉన్న కనెక్షన్లలో ప్రస్తుతం ఎల్పీజీ సబ్సిడీ కవరేజ్ 97శాతం మందికి ఉంది. సుమారు 27.76 కోట్లలో 26.12 కోట్ల వినియోగదారులకు పెంచిన సబ్సిడీ ధరలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు.