తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైదరాబాద్ మెట్రో తొలి రోజే తిరుగులేని రికార్డును నమోదు చేసింది. మొదటి రోజు అనూహ్యమైన రీతిలో 2 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించారని అధికారిక అంచనా. గతంలో వివిధ రాష్ట్రాల్లో కూడా మెట్రో ప్రారంభమైనా.. తొలి రోజు ప్రయాణికుల రికార్డు ఎప్పుడూ 50 వేలకు మించలేదు. ఆ ఘనత సాధించిన తొలి మెట్రో "హైదరాబాద్ మెట్రో" అనే చెప్పుకోవచ్చు. అత్యధునిక హంగులతో మెట్రోని తీర్చిదిద్ది ప్రయాణికులను ఆకట్టుకోవడమే అందుకు కారణమని పలువురు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఎల్ అండ్ టీ సంయుక్త భాగస్వామ్యంతో పట్టాలెక్కిన ఈ మెట్రో ప్రాజెక్టు ఈ స్థాయి ఘనత సాధించడం పట్ల ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించింది.
తొలి రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ "హైదరాబాద్ మెట్రో"ని ప్రారంభించిన తర్వాత , సీఎం కేసీఆర్తో కలిసి మియాపూర్ నుండి కూకట్ పల్లికి అదే మెట్రోలో ప్రయాణించారు. 24 స్టేషన్లను, 30 కిలోమీటర్లను కవర్ చేసే ఈ మెట్రో మియాపూర్ ప్రాంతం నుండి బయలుదేరి, జెఎన్టీయూ, కేపీహెచ్బీ, కూకట్ పల్లి, బాలానగర్, మూసాపేట, భరతనగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, ఎస్సార్ నగర్, అమీర్ పేట, బేగం పేట, ప్రకాష్ నగరు, రసూల్ పుర, పారడైజ్, పారడైజ్ గ్రౌండ్, సికిందరాబాద్ ఈస్ట్, మెట్టుగూడ, తార్నక, హబ్సీగూడ, ఎన్జీఆర్ఐ, స్టేడియం, ఉప్పల్ మీదుగా నాగోల్ చేరుతుంది.