జులై 5న కర్ణాటక బడ్జెట్ ప్రవేశపెట్టలోపే కుమారస్వామి ప్రభుత్వం పడిపోతుందని బెంగళూరులో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తో విభేదాలలే కూటమి కూలేందుకు కారణం అవుతుందని అంతా భావిస్తుండగా.. ఇప్పడే ప్రలోభ ప్రయత్నాలు చేయకుండా వేచి చూసే ధోరణిలో బీజేపీ ఉంది. కాగా అహ్మదాబాద్ లో అమిత్ షాను కలిసేందుకు సోమవారం వెళ్లిన యడ్యూరప్ప ప్రధానంగా ఈ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. యడ్యూరప్పతో పాటు కర్ణాటకకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు సమాచారం.
కుమారస్వామి Vs సిద్దరామయ్య
మాజీ సీఎం సిద్దరామయ్య– ప్రస్తుత సీఎం కుమారస్వామి మధ్య యుద్ధం తీవ్రమైంది. జూలై మొదటివారంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కుమారస్వామి కసరత్తు చేస్తుండగా.. వద్దని సిద్దరామయ్య చెప్తున్నారు. ఫిబ్రవరిలో కాంగ్రెస్ సర్కారు బడ్జెట్ సమర్పించిందని, ఇప్పుడు మరో బడ్జెట్ అవసరమేంటని సిద్దూ అంటున్నారు.
‘సిద్దరామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మంది ఎన్నికల్లో ఓడిపోయారు. వారి స్థానంలో కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే వారు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారు. బడ్జెట్‌కు రాహుల్ ఓకే చెప్పారు. సిద్దరామయ్య ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియటం లేదు’ అని కుమారస్వామి సిద్దూ వాదనను తోసిపుచ్చారు. ధర్మస్థలలో కొంతమంది ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య రహస్య మంతనాలు జరపడం బాగాలేదని దేవెగౌడ అన్నారు.