కష్టాల్లో కర్ణాటక సర్కార్.. చార్టర్డ్ ఫ్లైట్‌లో ముంబైకి తిరుగుబాటు ఎమ్మెల్యేలు

తీవ్ర సంక్షోభంలో పడిన కర్ణాటక సర్కార్.. చార్టర్డ్ ఫ్లైట్‌లో రాత్రికి రాత్రే ముంబైకి వెళ్లిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు

Last Updated : Jul 7, 2019, 08:20 PM IST
కష్టాల్లో కర్ణాటక సర్కార్.. చార్టర్డ్ ఫ్లైట్‌లో ముంబైకి తిరుగుబాటు ఎమ్మెల్యేలు

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి ఏర్పాటు చేసిన జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ముంబై బాటపట్టడంతో ప్రస్తుతం ఆ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆత్మరక్షణలో పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా స్పీకర్ కేఆర్ రమేష్‌కి లేఖలు పంపించారు. మంగళవారంలోగా స్పీకర్ నుంచి సమాధానం రానుంది. ఈలోగా శనివారం రాత్రికి రాత్రే 11 మంది ఎమ్మెల్యేలు చార్టర్డ్ ఫ్లైట్ లో ముంబైకి వెళ్లారు. కేబినెట్‌లో, నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కుతుందని భావించి భంగపడిన నేతల తిరుగుబాటుతో రెండు పార్టీలలో ఎప్పటి నుంచో అసమ్మతి నెలకొని ఉంది. దీనికితోడు రెండు పార్టీలలో కీలక పదవుల్లో వున్న అగ్రనేతలకు, అసంతృప్త నేతలకు మధ్య ఉన్న గ్యాప్ మరీ ఎక్కువవడం కూడా ఈ దుస్థితికి మరో కారణమైంది. ముంబైలోని సోఫిటెల్ హోటల్లో బస చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. జులై 10వ తేదీ వరకు రూమ్స్ బుక్ చేసుకుని ఉన్నారు. అలాగే ఆదివారం సాయంత్రం లేదా రాత్రి వరకల్లా మిగతా ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికే రానున్నారని తెలుస్తోంది. 

ఇదిలావుంటే, కాంగ్రెస్ అసంతృప్త నేతలను ముందుండి నడిపిస్తున్నట్టుగా భావిస్తున్న రామలింగా రెడ్డిని కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కేసి వేణుగోపాల్‌ని కలిసి బుజ్జగించేందుకు ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదని తెలుస్తోంది. ఎప్పటినుంచో పార్టీ తనపట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని కేసి వేణుగోపాల్‌కి రామలింగా రెడ్డి మొరపెట్టుకున్నట్టు సమాచారం. ఇదే విషయమై ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామితోనూ కేసి వేణుగోపాల్ చర్చించారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x