కరుణానిధి ఇక లేరు: ద్రవిడ ఉద్యమంలో ఒక శకం ముగిసింది

తమిళనాడు మాజీ సీఎం ముత్తువేల్ కరుణానిధి మరణంతో తమినాటి వేళ్లూనుకున్న ద్రవిడ ఉద్యమంలో ఒక శకం ముగిసింది.

Last Updated : Aug 8, 2018, 09:03 AM IST
కరుణానిధి ఇక లేరు: ద్రవిడ ఉద్యమంలో ఒక శకం ముగిసింది

తమిళనాడు మాజీ సీఎం ముత్తువేల్ కరుణానిధి మరణంతో తమినాట వేళ్లూనుకున్న ద్రవిడ ఉద్యమంలో ఒక శకం ముగిసింది. బ్రాహ్మణ, ఉత్తరాది ఆధిపత్య ధోరణి నిర్మూలన, ద్రావిడ భాషల(తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ)పరిరక్ష మరియు అణగారిన వర్గాలకు అధికారమనే ప్రధాన సిద్ధాంతాలతో కూడిన ద్రవిడ ఉద్యమాన్ని కరుణ తన తుదిశ్వాస వరకు కొనసాగించారు. పెరియార్ ప్రారంభించిన ద్రవిడ ఉద్యమాన్ని అన్నాదురై కొనసాగించగా.. వీరి నుండి కళైంజర్ స్ఫూర్తి పొందారు.

జాతీయ జెండాను ఎగురువేసిన తొలి సీఎం కరుణానిధి

1974వ సంవత్సరం  వరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గవర్నర్లు మాత్రమే ఆయా రాష్ట్రాల్లో జాతీయ జెండాను ఎగురవేసేవారు. దీన్ని వ్యతిరేకిస్తూ.. నాటి ప్రధాని ఇందిరా గాంధీకి అప్పుడు తమిళనాడు సీఎంగా ఉన్న కరుణానిధి లేఖ రాశారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఆగస్టు 15న సీఎంలు…జనవరి 26న గవర్నర్లు జెండా ఎగుర వేయాలని కేంద్రం ప్రకటించింది. దీంతో 1974 ఆగస్టు 15న సీఎంగా త్రివర్ణ పతాకాన్ని కళైంజర్ ఎగురవేశారు. దేశమంతా అప్పటి నుంచే ఈ సంప్రదాయం మొదలైంది.

దక్షిణాది గొంతుగా కరుణానిధి

ఉత్తరాది ఆధిపత్య అంతానికి దక్షిణాది రాష్ట్రాల తరఫున కరుణానిధి శంఖం పూరించారు. ఉత్తరాదిలో ఎక్కువగా మాట్లాడే హిందీ భాషను తప్పనిసరి చేస్తూ 1965లో కేంద్రం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా కరుణానిధి.. దక్షిణాది రాష్ట్రాల గొంతుక వినిపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చిన వ్యతిరేకత, ఆత్మగౌరవ ఉద్యమంతో దిగొచ్చిన ఇందిరా సర్కార్ హిందీతో పాటు ఇంగ్లీష్ నూ జాతీయ భాషలుగా 1967లో కేంద్రం ప్రకటించింది.

Trending News