వంట గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు మరోమారు షాకిచ్చాయి. వంటగ్యాస్ ధరలను మరోసారి పెంచుతూ చమురుకంపెనీలు ఉత్తర్వులు జారీ చేశాయి. సబ్సిడీలేని సిలిండర్ పై రూ.35రూపాయలు, సబ్సిడీ సిలిండర్లపై (ఎల్‌పీజీ) రూ.1.76పైసల మేర స్వల్పంగా పెరిగింది. బేస్ ధరను సవరించడం వల్ల పన్నుపై ప్రభావం పడింది.
పెంచిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఢిల్లిలో వంట గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం రూ.496.26కు విక్రయిస్తుండగా..ఇప్పుడది రూ.498.02కు చేరుకుంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వం ఏడాదికి 14.2 కిలోల 12 సిలిండర్లపై సబ్సిడీపై ఇస్తుంది. 12 కోటా దాటిన తర్వాత మార్కెట్ ధర చెల్లించి సిలిండర్ కొనాలి. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్‌పీజీ రేటు పెరగడం, డాలర్ మారకంతో రూపాయి బలహీనపడ్డం వంటి ప్రభావాల కారణంగా వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ధర పెరగడానికి ప్రధాన కారణం జీఎస్టి పన్నును సవరించడం. దేశీయంగా సబ్సిడీయేతర వంటగ్యాస్‌పై జీఎస్టీ పన్నును సవరించడం వల్ల ధరలు పెరిగాయని అధికారులు తెలిపారు. కాగా గత నాలుగేళ్లలో 27సార్లు వంట గ్యాస్ ధరలను కేంద్రం పెంచింది.