Maharashtra NCP Crisis: ట్రిపుల్ ఇంజిన్ సర్కారు మాది.. అజిత్ పవార్ చేరికపై సీఎం ఏక్‌నాథ్‌ షిండే కామెంట్స్

Maharashtra Politics: మహారాష్ట్రలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు స్థానంలో ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడిందని సీఎం ఏక్‌నాథ్‌ షిండే అన్నారు. ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయగా.. మరో 9 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 2, 2023, 05:56 PM IST
Maharashtra NCP Crisis: ట్రిపుల్ ఇంజిన్ సర్కారు మాది.. అజిత్ పవార్ చేరికపై సీఎం ఏక్‌నాథ్‌ షిండే కామెంట్స్

Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ తనకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలతో కలిసి అధికార పక్షానికి మద్దతు తెలిపారు. వెంటనే అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మంత్రులు, బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పుడు ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్‌గా మారిందని చెప్పారు. మహారాష్ట్ర అభివృద్ధికి అజిత్ పవార్, నాయకులు కలిసి రావడాన్ని తాను స్వాగితిస్తున్నట్లు చెప్పారు. అజిత్ పవార్ అనుభవం ప్రభుత్వాన్ని నడపడానికి, మహారాష్ట్రను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు ఉపయోగపడుతుందన్నారు.

అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయగా.. ఆయన వర్గంలోని మరో తొమ్మిది మంది నేతలకు కూడా మంత్రి పదవులు దక్కాయి. ఎన్సీపీలో మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 30 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరిపోయారు. ఆదివారం తన నివాసంలో ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ సమావేశం అయ్యారు. అనంతరం అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆయనతోపాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వానికి 40 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే వెల్లడించారు. 

288 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ రాలేదు. బీజేపీ 105 స్థానాలు, శివసేన 56, ఎన్‌సీపీ 54, కాంగ్రెస్‌ 44 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయి. బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. అయితే సీఎం పదవి విషయంలో పొత్తు కుదరకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. కొద్దిరోజులు రాష్ట్రపతి పాలన అనంతరం బీజేపీ-ఎన్‌సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌, డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అజిత్ పవార్‌కు ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయలేదు. 

ఆ తరువాత శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి మహా వికాస్‌ అఘాడీ కూటమిగా ఏర్పడి.. ఉద్ధవ్‌ ఠాక్రేను ముఖ్యమంత్రిగా ప్రకటించాయి. కొద్ది రోజులకు శివసేన నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే తనకు మద్దతు ఇచ్చిన 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలిసి తనకు 50 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని.. బీజేపీ కూడా మద్దతు ఇస్తుందని గవర్నర్‌కు లేఖ అందజేశారు. బలం తగ్గిపోవడంతో ముఖ్యమంత్రి పదవికి ఉద్దదేవ్ ఠాక్రే రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం బీజేపీతో కలిసి ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఏక్‌నాథ్‌ షిండే తరహాలోనే ఇప్పుడు అజిత్ పవార్ కూడా ఎమ్మెల్యేలతో అధికార పక్షంలో చేరిపోయారు. 

Also Read: Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. 29 మంది ఎమ్మెల్యేలతో జంప్  

Also Read: Karnataka Snake Video: చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచిన వ్యక్తి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News