న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పంజాబ్‌లోని అమృత్సర్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిస్తే బాగుంటుందని ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పటి నుంచో ఆయనను విజ్ఞప్తిచేస్తూ వస్తున్నాయి. సిక్కులకు పవిత్ర స్థలమైన అమృత్సర్ నుంచి మీరు (మన్మోహన్ సింగ్) పోటీ చేస్తే, సిక్కులు ఎంతో సంతృప్తి వ్యక్తంచేస్తారని పంజాబ్‌లోని కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. అయితే, మన్మోహన్ సింగ్ మాత్రం అక్కడి నుంచి పోటీకి అస్సలు ఏ మాత్రం ఆసక్తి కనబర్చడం లేదు. ఆ మాటకొస్తే, ఆయన ఎప్పుడూ లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన సందర్భాలూ లేవు.1999లో ఢిల్లీలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాల్లో ఒకటైన దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసి, బీజేపీ నేత వీకే మల్హోత్రా చేతిలో ఓటమిపాలయ్యారు.
పంజాబ్‌లోని కాంగ్రెస్ పార్టీ నేతలు మన్మోహన్ సింగ్‌ని ఇలా కోరడం ఇదేం మొదటిసారి కాదు. 2009లోనూ మన్మోహన్ సింగ్‌ని ఇదే విషయమై విజ్ఞప్తి చేయగా ఆయన తనకు ఆరోగ్యం బాగోలేదనే కారణంతో తిరస్కరించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కెప్టేన్ అమరిందర్ సింగ్ బీజేపీ నేత అరుణ్ జైట్లీపై పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత చోటుచేసుకున్న ఆసక్తికరమైన పరిణామాల నేపథ్యంలో అమరిందర్ సింగ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు అది వేరే విషయం.
1991 నుంచి మన్మోహన్ సింగ్ అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. జూన్ 14తో రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం ముగియనుంది. అస్సాం నుంచి తిరిగి మరోసారి ఆయనను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకునేందుకు తగినంత మెజారిటీ ఆ పార్టీకి లేదు. ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ వంటి పార్టీల మద్దతు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తున్నప్పటికీ... చివరి నిమిషం వరకు ఏం జరిగేది చెప్పలేని పరిస్థితి.