న్యూ ఢిల్లీ : గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా దేశ రాజధానిలోని ఎర్రకోట ప్రాంగణంలో జనవరి 26 - 31వ తేదీ వరకు ఏర్పాటు చేసిన "భారత్ పర్వ్" ఉత్సవాలలో ఈరోజు గురువారం సాయంత్రం ఢిల్లీకి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్య గురువు శ్రీమతి సీతానాగజోతి శిష్యబృందం, అభినయప్రణీత కూచిపూడి ఆర్ట్స్ సొసైటీ వారు ప్రదర్శించిన 'కూచిపూడి నృత్యాలు ఆద్యంతం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయనడంలో అతిశయోక్తి లేదని చెప్పవచ్చు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారత ప్రభుత్వ పర్యాటక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ గంగాధర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంయుక్త సంచాలకులు పి. కిరణ్ కుమార్ లు కళాకారులను శాలువాతో, జ్ఞాపికలతో సత్కరించారు. గంగాధర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎన్నో రకాలైన శాస్త్రీయ, జానపదకళలకు, లితకళలకు పేరెన్నికగన్నదని తన హర్షాన్ని వ్యక్తపరిచారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు వాటి అభివృద్ధికై రాష్ట్ర పర్యాటక శాఖ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.
కార్యక్రమంలో మొదటగా గురుశ్రీమతి సీతానాగజ్యోతి రాగమాలిక, ఆదితాళంలో రచించి, స్వరపరచి, నృత్యరచనచేసిన "వాణీకి వందనం" (సరస్వతి వందనం) కూచిపూడి నృత్యం తిలకించిన ప్రేక్షకుల చప్పట్లతో ఎర్రకోట కళాప్రాంగణం మారుమ్రోగింది. అనంతరం నారాయణ తీర్థులవారు రచించి, శ్రీమతి సీత నాగజ్యోతి నృత్యరచన చేసిన "తరంగం" ప్రత్యేకంగా కృష్ణలీలా తరంగిణి (గోవర్ధనగిరిధారి) ప్రదర్శనకు ప్రేక్షకుల కరతాళధ్వనులు మిన్నంటాయి.
కూచిపూడి నృత్యప్రదర్శన చేసిన కళాకారులు కుమారి అభినయ, వైష్ణవి, శ్రీతనయ, ఆకృతిఅగర్వాల్, సాయిశిరీషలను ప్రేక్షకులు అభినందనలతో ముంచెత్తారు.
ఢిల్లీలోని రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వాహకులు వీరేందర్ ముఖ్య అతిధులను జ్ఞాపికలతో సత్కరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..